
తల్లిదండ్రులు సత్యవతి, అప్పలనాయుడుతో సాయికుమార్(ఫైల్)
విశాఖ క్రైం: హోలీ వేడుకలు ఆ కుటుంబంలో విషాదం నింపాయి. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడిని రాకాసి అలలు అందని లోకానికి తీసుకుపోయాయి. కొడుకే సర్వస్వంగా బతుకుతున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. హోలీ వేడుకల్లో భాగంగా స్నేహితులతో సరదాగా ఆర్కే బీచ్‌కు వెళ్లిన దొండపర్తికి చెందిన సాయికుమార్ అనే విద్యార్థి సముద్రంలో మునిగి మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం బెలగాం గ్రామానికి చెందిన పోలి అప్పలనాయుడు కుటుంబం నాలుగేళ్ల క్రితం కుమారుడి చదువు కోసం విశాఖ నగరానికి పొట్టచేత పట్టుకొని వచ్చింది. అప్పలనాయుడు కారు డ్రైవరుగా పనిచేస్తూ కుటుంబం పోషిస్తున్నాడు. ఈయనకు భార్య సత్యవతి, కుమారుడు సాయికుమార్(14) ఉన్నారు. దొండపర్తి కుమ్మరివీధిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరి పక్కనే సమీప బంధువు కోలా నాగేశ్వరరావు, పొన్నాడ పుష్పవతి దంపతులు కూడా ఉంటున్నారు.
సాయికుమార్ అక్కయ్యపాలెంలోని ఎన్‌టీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. హోలీ పండగకు పాఠశాల సెలవు కావడంతో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకే సాయికుమార్ స్నేహితులు ఇంటికి వచ్చి తలుపు తట్టారు. తల్లి సత్యవతి ఎక్కడికి వెళుతున్నావురా.. అంటే రైల్వే గ్రౌండ్‌కి అని చెప్పి స్నేహితులతో కలిసి ఆర్కే బీచ్‌కు వెళ్లాడు. అక్కడ సరదాగా హోలీ సంబరాలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు పూసుకున్నారు. అనంతరం స్నానాల కోసం అందరూ సముద్రంలోకి దిగారు. అంతే ఒక్కసారిగా పెద్ద కెరటం వచ్చి సాయికుమార్‌ను లోపలికి లాక్కెళ్లిపోయింది. గమనించిన స్నేహితులు కేకలు వేసినా ఫలితం లేకపోయింది. వెంటనే సందర్శకులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలియడంతో సాయికుమార్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆర్కే బీచ్ వద్దకు చేరుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడి మృతదేహం చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు. సాయికుమార్‌తో వెళ్లిన నలుగురు విద్యార్థులను పోలీసులు విచారించారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment