సీతమ్మ పేరు పెట్టుకున్న నిన్ను అంత పవిత్రంగా చూడలేకపోయాడు వాడు. నిత్యం కష్టపడే నాన్నకు సాయపడాలన్న మంచి మనసున్న నిన్ను రక్షించుకోలేకపోయాం మేము. జనారణ్యంలో మృగాళ్లు నడి రోడ్డుపై సంచరిస్తున్నారని తెలుసు.. ప్రాణాలను తోడేస్తూ ఉన్మాదంగా వికటాట్టహాసం చేస్తున్నారనీ తెలుసు. ఈ విపత్కర పరిస్థితుల్లో నీవు కేవలం ఓ గాజు బొమ్మవని తెలిసినా నిన్ను జాగ్రత్తగా చూసుకోలేకపోయాం. టీచర్ కావాలని ఆశ పడి ఇష్టంగా పుస్తకాలు చదివే నీకు.. నీ చుట్టూనే రాక్షసులు ఉన్నారని చెప్పలేకపోయాం. జానకీ క్షమించు..రాజాం మండలం శ్యాంపురం పంచాయతీ గుయ్యానవలసకు చెందిన బోను జానకి (24) హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో మంగళవారం రాత్రి ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైంది. ఈ సమాచారం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
సాక్షి, రాజాం: శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం శ్యాంపురం పంచాయతీ గుయ్యానవలసకు చెందిన బోను జానకి హత్యకు గురికావడంతో గ్రామంలో విషాదం అలముకుంది. బోను సూరప్పడు, జయమ్మలకు ఆరుగురు కుమార్తెలు. అయిదుగురికి వివాహాలయ్యాయి. ఆరో కుమార్తె జానకి (24) డిగ్రీ వరకూ చదువుకుంది. టీచర్ కావాలనే ఆశతో నిత్యం పుస్తకాలు చదువుతూ ఉండేది. అయితే కష్టపడితేగాని పూటగడవని కుటుంబం కావడంతో తల్లిదండ్రులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో రెండేళ్ల క్రితం అక్క భారతి సహాయంతో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో డీమార్ట్ సూపర్‌మార్కెట్‌లో పనికి కుదిరింది. అక్కడ అక్క ఇంట్లోనే కొన్నాళ్లు ఉండేది.
కొద్ది నెలల క్రితం డిమార్ట్ సమీపంలోనే గదిని అద్దెకు తీసుకొని స్నేహితురాలితో కలసి ఉంటుంది. కొన్నాళ్లుగా ఆనంద్ అనే యువకుడు ప్రేమిస్తున్నానని జానకి వెంటపడుతుండేవాడు. ఈ విషయాన్ని స్నేహితురాలితో చెప్పి జానకి బాధపడేది. ఆనంద్ వేధింపులు రోజురోజుకూ ఎక్కువ కావడంతో కొద్ది రోజుల క్రితం తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇక్కడ ఉండలేనని, పనికి కూడా వెళ్లలేని పరిస్థితిలో ఉన్నానని రోదిస్తూ చెప్పింది. సంక్రాంతి పండుగకు వచ్చేస్తానని, పెళ్లి ప్రయత్నాలు చేయమని కోరింది. అయితే ఇంతలోనే మంగళవారం రాత్రి ఆమె ప్రేమోన్మాది ఆనంద్ చేతిలో హత్యకు గురైంది.
ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తండ్రి సూరప్పడుతోపాటు కొంతమంది బంధువులు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. విద్యావంతురాలైన తమ కుమార్తెను పొట్టనపెట్టుకున్న ఆనంద్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కుటుంబానికి అండగా ఉంటుందనుకున్న కుమార్తె హత్యకు గురికావడంతో తమను ఎవరు ఆదుకుంటారని జానకి తల్లి జయమ్మ రోదించిన తీరు స్థానికులను కలచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment