
సంఘటన స్థలం వద్ద గుమిగూడిన జనం
ముండ్లమూరు: మండలంలోని ఈదర గ్రామానికి చెందిన క్రిష్టపాటి కొండారెడ్డి (28)ని ప్రత్యర్థులు అతి కిరాతకంగా వేటకొడవళ్లతో నరికి చంపారు. ఈ సంఘటన రమణారెడ్డిపాలెం–అయోధ్యనగర్ గ్రామాల మధ్య సోమవారం మధ్యాహ్నం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. ఈదర గ్రామానికి చెందిన క్రిష్టపాటి వెంగళరెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డిలు ద్విచక్ర వాహనంపై దర్శి కోర్టుకు వాయిదాకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. ప్రత్యర్థులు మార్గమధ్యంలోని రమణారెడ్డిపాలెం–అయోధ్యనగర్ గ్రామాల మధ్య రెండు ద్విచక్ర వాహనాలపై అడ్డగించి వేట కొడవళ్లతో దాడికి దిగారు. తండ్రికొడుకులు కింద పడిపోయారు. వెంగళరెడ్డిపై దాడి చేయడంతో గాయాలతో సమీప గ్రామం రమణారెడ్డిపాలెంలోకి పరుగు తీశాడు. దాడిని గమనించిన స్థానికులు అటుగా రావడంతో దుండగులు కొండారెడ్డిని వేటకొడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపి అక్కడి నుంచి పారిపోయారు. గాయపడిన వెంగళరెడ్డిని తొలుత స్థానికులు వైద్యశాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
దుండగులు మళ్లీ దాడి చేస్తారన్న భయంతో కుటుంబ సభ్యులు వచ్చేంత వరకూ క్షతగాత్రుడిని గ్రామంలోనే ఉంచాల్సి వచ్చింది. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని గాయాలతో ఉన్న వెంగళరెడ్డిని ఓ ప్రైవేటు వాహనంలో దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తీసుకెళ్లారు. మృతుడు కొండారెడ్డికి భార్య రాజ్యలక్ష్మి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. హత్య సమాచారం తెలుసుకున్న దర్శి డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐ శ్రీనివాసరావులు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని హత్యకు కారణాలు స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుడు వెంగళరెడ్డి ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. గ్రామానికి చెందిన క్రిష్టపాటి కొండారెడ్డి హత్యకు గురికావడంతో పాటు అతడి తండ్రికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు, బంధువుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పాతకక్షల నేపథ్యంలోనే హత్య: గ్రామానికి చెందిన కొందరితో మా కుటుంబ సభ్యులకు వ్యక్తిగత తగాదాలు ఉన్నాయి. కొంతకాలంగా వారికి మాకు గొడవలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే కోర్టు వాయిదా కోసం దర్శి వెళ్లి వస్తుండగా ఈదర గ్రామానికి చెందిన బండి చిన్నపరెడ్డి, బండి నాగిరెడ్డి, బాపిరెడ్డి, శ్రీనివాసరెడ్డిలు వెంబడించి నాపై దాడి చేసి నా బిడ్డను హత్య చేశారు.-వెంగళరెడ్డి, క్షతగాత్రుడు