కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న మృతుడి తల్లిదండ్రులు, సుమంత్ మృతదేహం(ఇన్‌సెట్) సుమంత్ (ఫైల్)
చారిత్రక గుత్తికొండపై మే 25న హత్యకు గురైన యువకుడి మిస్టరీ శుక్రవారం వీడింది. స్నేహితులే హంతకులని పోలీసుల విచారణలో తేలింది. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమైంది.
అనంతపురం, గుత్తి: గుత్తికొండపై సంచలనం రేపిన యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా జమ్మిచేడుకు చెందిన రవి, సునీత దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండవ కుమారుడు సుమంత్ (20) పదో తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు మానుకుని కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. అయితే యువతి సోదరుడు శివకు వీరి పెళ్లి ఇష్టం లేదు. రెండు, మూడు సార్లు సుమంత్‌తో గొడవపడ్డాడు. అయితే సుమంత్, శివలు స్నేహితులు కావడంతో గొడవలు మరిచిపోయారు.
హత్యకు పక్కా ప్లాన్..
శివ, పగల రాజు ఇద్దరూ ఇంటర్మీడియట్ సెకెండియర్ చదివి ఫెయిల్ అయ్యారు. సుమంత్, శివ, పగల రాజు ముగ్గురు మంచి స్నేహితులు. అయితే సుమంత్ తన చెల్లిని ప్రేమించడం శివకు ఇష్టం లేదు. సుమంత్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు. సుమంత్‌ను చంపడానికి ప్రీ ప్లాన్ చేశాడు. శివ, పగల రాజులు సుమంత్‌ను వెంట బెట్టుకుని మే 25న గుత్తి స్వస్థత శాలకు వచ్చారు. ముందుగా అనుకున్న ప్రకారం సుమంత్‌ను గుత్తి కొండపైకి తీసుకెళ్లారు. కొండపై ఉన్న బావి పక్కన సుమంత్‌కు పూటుగా మద్యం తాపించారు. ఒక్కసారిగా రాళ్లు, మద్యం బాటిళ్లతో సుమంత్‌పై శివ, పగలరాజులు దాడిచేశారు. విపరీతంగా రక్తస్రావమై సుమంత్ అక్కడికక్కడే మరణించాడు. అయితే కొన ఊపిరి ఉందనే నెపంతో సుమంత్‌ను బావిలో పడేశారు.
హతుడిని గుర్తించిందిలా..
మరుసటి రోజు అంటే మే 26న గుత్తికొండలోని బావిలో మృతదేహం ఉన్నట్లు కోట సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే మృతుడి ఆచూకీ లభించలేదు. గుర్తు తెలియని యువకుడు దారుణ హత్య అంటూ పత్రికలు, టీవీ చానళ్లలో వచ్చింది. ఐదారు రోజులు గడిచినా ఎవరూ గుర్తించలేదు. శుక్రవారం వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో హతుడు ఫొటోను పోలీసులు పోస్టు చేశారు. ఫేస్‌బుక్‌లో సుమంత్ ఫొటోను గుర్తించిన తల్లిదండ్రులు హుటాహుటిన గుత్తికి వచ్చారు. సుమంత్‌ను నాలుగు రోజుల క్రితమే పూడ్చివేశారు. దుస్తులు, చెప్పులు చూసి హతుడు తమ కుమారుడు సుమంత్ అని వారు గుర్తించారు. హతుడి తల్లిదండ్రులు లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ కొడుకును చివరి చూపు చూడాలని తల్లిదండ్రులు పట్టుబట్టడంతో సీఐ ప్రభాకర్ గౌడ్ స్పందించి పూడ్చి పెట్టిన శవాన్ని బయటకు తీయించారు. కుళ్లిపోయిన శవాన్ని అంత్యక్రియల నిమిత్తం గద్వాల్‌కు తీసుకెళ్లారు. సీఐ ప్రభాకర్ గౌడ్, ఎస్‌ఐ వలిబాషా, పోలీసు సిబ్బంది గద్వాల్ (జమ్మిచేడు)కు వెళ్లి హంతకుల్లో ఒకరైన పగలరాజును మరో హంతకుడైన శివ తండ్రిని అదుపులోకి తీసుకుని గుత్తికి తీసుకొచ్చారు. మరో హంతకుడు శివ కోసం గాలిస్తున్నారు.
హంతకులను కఠినంగా శిక్షించాలి
అభం శుభం తెలియని తమ కుమారుడు సుమంత్‌ను అతి దారుణంగా హత్య చేసిన హంతకులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మృతుని తల్లిదండ్రులు రవి, సునీతలు పోలీసులను డిమాండ్ చేశారు. ప్రేమిస్తే చంపేస్తారా? అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. తమ కుమారున్ని చంపిన హంతకులు శివ, పగల రాజు తమకేమీ తెలియనట్లు ఇంటికి వచ్చి ‘సుమంత్ ఎక్కడికి వెళ్లాడ’ని అడిగారన్నారు. ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షిస్తేనే సమాజం బాగుపడుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment