మడివి రమేష్ మృతదేహం
చర్ల : ఏజెన్సీ మరోసారి ఉలిక్కిపడింది. అక్కడ అలజడి చెలరేగింది. అడవిలో అర్థరాత్రి దారుణం జరిగింది. ఎప్పుడు..? ఎక్కడ..? ఏమైంది..? వీటికి సమాధానాలు కావాలనుకుంటే ఇది చదవండి...
మండల కేంద్రాలైన చర్ల, వెంకటాపురం మ ధ్యన రోడ్డు ఉంది. దానికి చుట్టూ దట్టమైన అడవి. ఆ రోడ్డు దిగి, కాలిబాటన దాదాపుగా మూ డు కిలోమీటర్ల దూరం వెళితే.. అక్కడక్కడ విసిరేసినట్టుగా చిన్న చిన్న గుడిసెలు కనిపిస్తాయి. అదొక కుగ్రామం. దాని పేరు.. క్రాంతిపురం. చర్ల మండలం సుబ్బంపేట పంచాయతీ పరిధిలో ఉంది. ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీలు సరిహద్దు దాటి ఇక్కడ, ఈ అడవిలో ఇలా చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఇక్కడే నివసిస్తున్నారు. కూలీనాలీ పనులు చేసుకుంటున్నారు. అతడి పేరు మడివి రమేష్(30), నిరుపేద కూలీ. మంగళవారం రాత్రి ఆయన, భార్య నందిని, పిల్లలు కలిసి భోజనం చేసి పడుకున్నారు. అర్థరాత్రి సుమారు 12 గంటల సమయంలో ఆయన ఇంటికి ఆరుగురు వచ్చారు. రమేష్‌ను లేపారు. భార్య నందిని కూడా లేచింది. వారు ఎవరో.. ఎందుకొచ్చారో ఆ దంపతులకు అంతుబట్టలేదు. బిత్తరపోయి.. భయం భయంగా చూస్తున్నారు. ఆ ఆరుగురి వద్ద మారణాయుధాలు (గొడ్డళ్లు, కత్తులు) ఉన్నాయి. వారిలో ఏ ఒక్కరూ ఒక్క మాటయినా మాట్లాడడం లేదు. రమేష్‌ను బలవంతంగా పైకి లేపారు. బయటకు తీసుకెళ్లారు.
భర్త వెంటే భార్య నందిని కూడా వెళ్లింది. ఇంటి ముందు, రమేష్‌ను ఆ ఆరుగురు కలిసి ఇష్టానుసారంగా కొడుతున్నారు. ఎవరు మీరు..? ఎందుకు కొడుతున్నారు,..? అని నందిని భయంతో వణుకుతూ, గొంతు పెగుల్చుకుని అడిగింది. ఉహూం.. సమాధానం లేదు. కొడుతూనే ఉన్నారు. ఆమె అడ్డుకోబోయింది. ఆమెను కూడా కొట్టారు. ఆమె బిగ్గరగా రోదిస్తూ, నాలుగడుగుల దూ రంలోగల గుడిసెల వద్దకు వెళ్లింది. గట్టిగా అ రుస్తూ వారిని లేపింది. అందరూ వచ్చారు. కొ ద్దిసేపటి క్రితం వరకు అక్కడే ఉన్న ఆ ఆరుగురు ఆగంతకులు కనిపించలేదు. మాయమయ్యారు. ఒంటి నిండా గాయాలతో.. ఆగకుండా కారుతున్న రక్తపు ధారలతో.. రమేష్ అక్కడే పడున్నాడు.. ఒంటరిగా.. నిశ్చలంగా.. నిర్జీవంగా..! అతడి ప్రాణం పోయింది. నందిని ఘొల్లుమంది. గుండెలవిసేలా రోదించింది. ఎవరొచ్చారో తెలియదు.. ఎందు కొచ్చారో తెలియదు.. ఎందుకు కొట్టారో తెలియదు.. ప్రాణాలెందుకు తీశారో తెలియదు...
ఎవరీ రమేష్..?
ఇక్కడి వలస కుగ్రామానికి పెద్దగా ఈ రమేష్ వ్యవహరిస్తున్నాడు. అక్కడున్న ఆదివాసీల మధ్య ఏదేని తగాదాలు వస్తే పంచాయితీ పెట్టి, పరిష్కరిస్తుంటాడు. అక్కడి వారు కూడా అతడికి, అతడి మాటకు గౌరవమిస్తారు. సహజం గానే, వ్యతిరేకులు కూడా తయారయ్యారు.
ఎవరు చంపారు..?
ఎవరికీ తెలియదు. ఈ గ్రామంలోని కొంద రు ఆదివాసీలు మాత్రం.. ‘‘ఇది మావోయిస్టుల పనే’’ అని అనుమానిస్తున్నారు. ‘‘ఇన్ఫార్మర్ నెపంతో ఇతడిని మావోయిస్టులే చంపారేమో. సరిగ్గా రెండు నెలల క్రితం (నవంబర్ 25వ తేదీ రాత్రి) ఇదే మండలం(చర్ల)లోని పెద్దమిడిసిలేరు గ్రామానికి చెందిన సోడి ప్రసాద్(50)ను ఇన్ఫార్మర్ పేరుతో అన్నలు (మావోయిస్టులు) చంపేశారు. రమేష్‌ను కూడా వాళ్లే చంపారేమో..’’ అంటున్నారు. దీనిని పోలీసులు కొట్టేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ హత్య జరిగి ఉండవచ్చని వారు చెబుతున్నారు. ఈ గ్రామాన్ని చర్ల ఎస్సై సత్యనారాయణతో కలిసి సీఐ శ్రీనివాసులు పరిశీలించారు. రమేష్ భార్య నందిని ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు.ఈ హత్య మిస్టరీని పోలీసులే విప్పాలి. హంతకులు ఎవరో వారే చెప్పాలి. అప్పటిదాకా మనమంతా ఆగాలి
Comments
Please login to add a commentAdd a comment