
బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే రాజయ్య
రఘునాథపల్లి : కుటుంబ కలహాలతో మనోవేదనకు గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మేకలగట్టు శివారు ఎర్రగడ్డతండాలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... ఎర్రగడ్డతండాకు చెందిన ఇస్లావత జాన్,బుజ్జి దంపతుల రెండో కుమారుడు ఇస్లావత్ మహేందర్ (22) హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో పని చేస్తుండేవాడు. వారం క్రితం వరి పంట కోత పనులున్నాచి, ఇంటికి రావాలని తండ్రి పోన్ చేయడంతో మహేందర్ తండాకు చేరుకొని వరి కోత పనులు చేస్తున్నాడు.
శుక్రవారం ఉదయం మహేందర్ తల్లిదండ్రుల వద్ద తన పెళ్లి ప్రస్తావన తీసుకురాగా అన్న పెళ్లి కాకుండా నీ పెళ్లి కుదరదంటూ నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మనస్తాపం చెందిన మహేందర్ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. మధ్యాహ్నం వరకు కుమారుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా పురుగుల మందు తాగి అపస్మాకర స్థితిలో ఉన్న కుమారుడిని చూసి పెద్ద ఎత్తున రోదించారు.
స్థానికులు చేరుకొని వెంటనే జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జనగామ మార్చుకీలో మహేందర్ మృతదేహాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎస్సై రంజిత్‌రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment