
సాక్షి, శంకరపట్నం (మానకొండూర్): కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో పరువు హత్య మంగళవారం కలకలం సృష్టించింది. తమ కూతురును ప్రేమ పేరిట వేధిస్తున్నాడని భావించిన యువతి తల్లిదండ్రులే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. హతుడి ప్రియురాలు, బంధువుల కథనం ప్రకారం.. తాడికల్‌కు చెందిన గడ్డి సారయ్య, మల్లమ్మ దంపతుల చిన్న కుమారుడు గడ్డి కుమార్ (23) హుజూరాబాద్‌లోని ఓ సెల్ పాయింట్‌లో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని హుజూరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అంతకుముందే ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయాన్ని గమనించిన అమ్మాయి తల్లిదండ్రులు.. కుమార్‌ను మందలించారు. పైగా తమ కూతురును కుమార్ కిడ్నాప్ చేశాడంటూ ఫిర్యాదు చేయడంతో పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో పోలీసులు కుమార్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయినా ఇద్దరి వైఖరిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఈ నెల 6న ప్రేమికులిదరూ నిజామాబాద్‌కు పారిపోయారు. 7న శంకరపట్నంలో దిగారు. అనంతరం బాలికను తాడికల్ పంపించిన కుమార్.. హుజూరాబాద్ వెళ్లిపోయాడు. అప్పటికే కుమార్‌పై కక్ష పెంచుకున్న బాలిక తల్లిదండ్రులు ఎలాగైనా మట్టుబెట్టాలని పథకం పన్నారు.
అదేరోజు రాత్రి కుమార్ తాడికల్‌కు రాగానే.. బాలిక తండ్రి నర్సయ్య, మేనమామ మొల్గూరి శ్రీనివాస్, తాత సత్తయ్య, పెద్దనాన్నలు శ్రీనివాస్, సమ్మయ్య కుమార్‌ను చింతగుట్ట శివారులోని గుట్టల్లోకి తీసుకెళ్లారు. కీడును శంకించిన కుమార్ ఈ విషయాన్ని సదరు బాలికకు ఫోన్‌లో చేరవేశాడు. దీంతో అప్రమత్తమైన బాలిక వెంటనే కుమార్ తల్లిదండ్రులకు సమాచారం అందించింది. అప్పటికే రాత్రి 11 గంటల సమయం కావడం.. కుమార్ ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో బంధువులు అదేరాత్రి చింతగుట్ట శివారులో వెదికారు. ఆచూకీ లభించకపోవడంతో సోమవారం ఉదయమే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో బంధువులు తాడికల్ వద్ద ధర్నాకు దిగారు. మంగళవారం ఉదయం ఎంగిలి పూల కోసం అదే గ్రామానికి చెంది న ఓ మహిళ పత్తి చేనులోకి వెళ్లగా మృతదేహం కనిపించింది. విషయాన్ని గ్రామస్తులకు చెప్పడంతో అది కుమార్ మృతదేహంగా తేలింది. ఆదివారం రాత్రే హత్య చేసి.. మృతదేహాన్ని ఆటోలో తీసుకొచ్చి పత్తి చేనులో పడేసిన ఆనవాళ్లు కనిపించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మద్యంలో యాసిడ్ కలిపి తాగించి హత్య చేసినట్లు నిర్ధారించారు.
పొట్టనబెట్టుకున్నారు: ప్రియురాలు
కుమార్ మృతదేహం వద్ద బాలిక తీవ్రంగా రోదించింది. ‘లే నాని లే..’అంటూ ఆ అమ్మాయి ఏడ్వడం అక్కడున్న వారికి కన్నీళ్లు తెప్పించింది. కుమార్‌ను తన తల్లిదండ్రులు.. మేనమామ కలిసే హతమార్చారని ఆరోపించింది.
ఎస్సైపై దాడి.. పోలీసు వాహనం ధ్వంసం
మృతదేహాన్ని పరిశీలించేందుకు ఎస్సై సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకోగా.. మృతుడి బంధువులు దాడికి దిగారు. తమ కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, నిందితుల నుంచి రూ.4 లక్షలు తీసుకున్నావని దాడి చేయడంతో ఎస్‌ఐ గాయపడ్డాడు. అక్కడే ఉన్న పోలీస్ వాహనాన్ని బంధువులు ధ్వంసం చేశారు.
అన్ని కోణాల్లో విచారణ: ఏసీపీ
కుమార్ హత్యపై అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నామని ఏసీపీ కృపాకర్ తెలిపారు. కుమార్, అదే గ్రామానికి చెందిన బాలిక ఏడాది కాలంగా ప్రేమించుకున్నట్లు చెప్పారు. ప్రేమ పేరిట వేధింపులకు గురిచేస్తున్నాడనే ఫిర్యాదు మేరకు కుమార్‌పై కేసు నమోదైందన్నారు. ఈ నెల 6న హుజూరాబాద్‌కు వెళ్లిన బాలికను కుమార్ నిజామాబాద్ తీసుకెళ్లి.. మరుసటి రోజు ఇంటికి పంపినట్లు సమాచారం. అదేరోజు రాత్రి కుమార్ కనిపించడం లేదని అతడి తండ్రి సారయ్య ఫిర్యాదు చేయడంతో కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యం కేసు నమోదు చేశామని వివరించారు. పోస్టుమార్టం నివేదిక, ఫోన్ కాల్ డేటా ఆధారంగా అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని చెప్పారు. విచారణ అధికారిగా హుజూరాబాద్ రూరల్ సీఐ రవికుమార్‌ను నియమించామని, దోషులెవరైనా చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
అన్ని కోణాల్లో విచారణ: ఏసీపీ
Comments
Please login to add a commentAdd a comment