వినోద్ (ఫైల్)
చెన్నై, టీ.నగర్: కాట్టుమన్నార్‌కోవిల్ పోలీసుస్టేషన్‌లో యువకుడు అనుమనాస్పదంగా మృతి చెందాడు. ఇది లాకప్‌డెత్ అంటూ యువకుడి బంధువులు పోలీసుస్టేషన్ ముట్టడించడంతో గురువారం ఉద్రిక్తత పరిస్థితుల ఏర్పడ్డాయి. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న విల్లుపురం డీఐజీ విచారణ అనంతరం హెడ్‌కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఎస్‌ఐని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కడలూరు జిల్లా, కాట్టుమన్నార్‌కోవిల్లో బుధవారం రాత్రి పోలీసులు గస్తీ తిరుగుతుండగా ఆ సమయంలో స్టేట్‌బ్యాంక్ ఏటీఎం వద్ద అనుమానాస్పదంగా ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. అతను రుద్రచోళై గ్రామానికి చెందిన మూర్తి కుమారుడు వినోద్ (25)గా తెలిసింది. ఇతను రాష్ట్రంలోని పలు ఏటీఎం కేంద్రాల్లో నగదు డ్రా చేసే వారికి సాయపడుతున్నట్లు నటించి మోసాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో అతన్ని పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. గురువారం తెల్లవారుజామున అతని సొంతవూరైన రుద్రచోళైకు తీసుకువెళ్లారు. అతని ఇంట్లో ఆరు ఏటీఎం కార్డులు, నగదు డ్రా చేసిన రిసిప్టులు కనిపించాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత పోలీసు స్టేషన్ లాకప్‌లో ఉంచారు. కొంత సేపటికి శబ్ధం రావడంతో అక్కడికి వెళ్లి చూడగా వినోద్ తాను కట్టుకున్న పంచెతో కిటికీ చువ్వలకు ఉరేసుకుని ప్రాణాపాయస్థితిలో కనిపించాడు. వెంటనే పోలీసులు అతడిని చికిత్స కోసం కాట్టుమన్నార్‌కోవిల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స ఫలించక వినోద్ మృతిచెందాడు.
పోలీసుస్టేషన్ ముట్టడి: కాట్టుమన్నార్‌కోవిల్ పోలీసు స్టేషన్, ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బంధువులు, ప్రజలు గుమికూడడంతో గురువారం ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసు స్టేషన్‌లో యువకుడు హత్యకు గురైనట్లు ప్రజలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాట్టుమన్నార్‌కోవిల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరపాలని, హత్యకు కారకులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు. దీంతో విల్లుపురం డిఐజీ సంతోష్‌కుమార్, జిల్లా ఎస్పీ అభినవ్, ఎడీఎస్పీ పాండియన్ సహా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుందనే ఉద్ధేశ్యంతో మృతదేహాన్ని కాట్టుమన్నార్ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కడలూర్ పంపేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులతో చర్చల అనంతరం కడలూరు తీసుకువెళ్లారు. డీఐజీ సంతోష్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ వినోద్‌పై అనేక ఏటీఎం ప్రాడ్ కేసులు ఉన్నాయని, అతను పట్టుబడడంతో మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కడలూరు ప్రభుత్వ ఆస్పత్రికి పంపామని అన్నారు. పోస్టుమార్టం వీడియో రికార్డు చేయబడుతుందని, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు సమాచారం పంపుతామన్నారు. దీని ఆధారంగా విచారణ జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment