నాని భార్య నుంచి వివరాలు సేకరిస్తున్న సీఐ రేవతమ్మ,
గొలుగొండ(నర్సీపట్నం): కృష్ణదేవిపేట– నర్సీపట్నం రోడ్డులో ఉన్న రాజులు బాబు గుడి వద్ద శనివారం అర్ధరాత్రి ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఎవరైనా హత్య చేశారా ? లేక ప్రమాదం కారణంగా మృతి చెందాడా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరో హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారనే అనుమానాన్ని కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో ఏటిగైరంపేటకు చెందని సారిపల్లి నాని(35) అనే వ్యక్తి మృతదేహాన్ని ఆదివారం ఉదయం కృష్ణదేవిపేట– నర్సీపట్నం మార్గంలో రాజులుబాబు సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న కల్వర్టు వద్ద స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ కల్వర్టు నిర్మాణంలో ఉండడంతో ప్రధాన రోడ్డును బ్లాక్ చేసి కల్వర్టు నిర్మాణం వద్ద డైవర్షన్ ఇచ్చారు.
రోడ్డుకు అడ్డంగా పెద్ద రాళ్లు, మట్టి వేసి పనులు చేస్తున్న ప్రాంతంలోకి ఎవరూ రాకుండా కాంట్రాక్టర్లు ఏర్పాట్లు చేశారు. ఈ మార్గం పూర్తిగా బంద్ అయినప్పటికీ నాని బైక్‌పై వచ్చి ఈ కల్వర్టులో పడి ఉన్నట్టు గుర్తించారు. బైక్ కల్వర్టు వద్దకు అచ్చే అవకాశం లేదని, ఎవరో గుర్తుతెలియన వ్యక్తులు హత్యచేసి కల్వర్టులో పడేశారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. పనులు జరిగే ప్రాంతం వద్దకు బైక్ వెళ్లిన ఆనవాళ్లు కూడా కనిపించలేదు. నాని హెల్మెట్ ధరించి ఉండగా తలకు బలమైన గాయం కావడంతో పాటు ముఖమంతా గాయాలున్నాయి. ఘటన స్థలంలో బైక్ ఒకచోట, నాని మృతదేశం ఒకచోట, చెప్పులు మరో చోట ఉన్నాయి. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. సెల్‌ఫోన్‌లో కాల్‌డేటాను పరిశీలించారు. నాని ఏటిగైరంపేట గ్రామంలో చిన్న హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు పిల్లలు, భార్య లక్ష్మి ఉన్నారు. నాని మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, గొలుగొండ ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment