
గతేడాది ఆత్మహత్య చేసుకున్న అంబుజ (ఫైల్),కామాంధుడు మహంతేష్(ఫైల్), ఫిర్యాదుచేయడానికి వచ్చిన బాధిత యువతి
ఆ పల్లెలో కామాంధుడు ఒక కుటుంబపై కన్నేశాడు. వారి మానప్రాణాలతో ఆడుకుంటున్నాడు. ఇప్పటికే ఒకరిని పొట్టనబెట్టుకుని, మరొకరినీ బలిగొనాలని నిత్యం వేధిస్తుంటే, బాధితులు సాయం కోసం పోలీసులను ఆశ్రయించారు.
రామనగర (దొడ్డబళ్లాపురం) : కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధుడు విచ్చలవిడిగా వ్యవహరిస్తూ యువతుల పట్ల నరకాసురిని మాదిరిగా తయారయ్యాడు. ఆ కామాంధుడు గతేడాది యువతిపై అత్యాచారయత్నం చేయడంతో ఆమె అవమానం భరించలేక మరుసటిరోజే ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు అదే కామాంధుడు మృతురాలి చెల్లెలిని కూడడా లైంగికంగా వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇంత జరుగుతున్నా పోలీసులు అతని దురాగతాలపై కన్నెత్తిచూడడం లేదు. ఈ సంఘటన చెన్నపట్టణ తాలూకా బీవీ హళ్లిలో వెలుగు చూసింది.
దిక్కులేని యువతులపై కన్ను
ఈ గ్రామంలో ఒంటరిగా జీవిస్తున్న ఒక మహిళ తన అక్క కుమార్తెలు ఇద్దరిని తీసుకువచ్చి తన దగ్గరే ఉంచుకుని పోషిస్తోంది. గతేడాది అక్టోబర్ 20వ తేదీన పెద్దమ్మాయి అంబుజపై ఇదే గ్రామం నివాసి అయిన మహంతేశ్ అనే యువకుడు అత్యాచారయత్నం చేశాడు. అయితే సమయానికి అంబుజ పిన్ని రావడంతో పరారయ్యాడు. ఈ ఘటనలో ఊరి పెద్దలు పోలీసు కేసు వద్దని అంబుజకు నచ్చజెప్పి, కామాంధుడు మహంతేష్‌ను మందలించి వదిలేశారు. అత్యాచారయత్నం జరగడం, నిందితుడు ఎటువంటి శిక్ష లేకుండా తప్పించుకోవడంతో మానసికంగా కృంగిపోయిన అంబుజ మరుసటిరోజే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో అంబుజ కన్నతల్లి ఆగ్రహం పట్టలేక మహంతేష్‌ను గ్రామంలో చెప్పుతో కొట్టింది. దాంతో పగను పెంచుకున్న మహంతేశ్ కొన్ని రోజులు సైలెంట్‌గా ఉండి మళ్లీ ఇప్పుడు మృతురాలు అంబుజ చెల్లెలిని లైంగికంగా వేధించడడం ప్రారంభించాడు.
నీ అక్క గతే పట్టిస్తానని బెదిరింపులు
బాధిత యువతి గ్రామంలో తిరిగే పరిస్థితి లేకుండా మహంతేష్ దిగజారి ప్రవర్తిస్తున్నాడని, దుర్భాషలాడుతూ, చేతులు పట్టి లాగుతున్నాడని విలపిస్తోంది. నీ అక్కకు పట్టిన గతే నీకు పట్టిస్తానని బెదిరిస్తున్నాడని బోరుమని విలపిస్తోంది. ఆ మృగానిపై బాధిత యువతి తన పిన్నితో కలిసి చెన్నపట్టణ గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహంతేష్ నుండి తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరడం జరిగింది. అత్యాచారయత్నం జరిగితే నిందితుడిని మందలించి వదిలేయడమేంటని, ఇంకా ఏ కాలంలో ఉన్నామని స్థానికంగా తీవ్ర విమర్శలు వస్తుండడంతో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment