
చిట్టేడు వద్ద ఆదివారం రాత్రి రక్తగాయాలతో పడి ఉన్న నాగరాజమ్మ
కోట: టెట్ రాసి వస్తూ.. అనుమానాస్పదస్థితిలో ఓ యువతి మృతి చెందగా, ఆమెకు తోడుగా వెళ్లిన అత్త తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన మండలంలోని చిట్టేడు వద్ద గురువారం రాత్రి జరిగింది. పోలీసులు, యువతి బంధువుల సమాచారం మేరకు.. చిల్లకూరు మండలం అన్నంబాక గ్రామానికి చెందిన బొమ్మిళ్ల పెద్దసుబ్బయ్య,లక్ష్మమ్మ కుమార్తె నాగరాజమ్మ (25) ఎంఏ, బీఈడీ చేసి ఉద్యోగ వేటలో ఉంది. గురువారం కావలి సర్వోదయ కళాశాలలో టెట్ రాసేందుకు ఆమె అత్త సుబ్బమ్మను తోడుతీసుకుని వెళ్లింది. మధ్యాహ్నం పరీక్ష రాసిన అనంతరం నెల్లూరులో వాకాడు డిపో ఎక్స్‌ప్రెస్ సర్వీసు ఎక్కారు. చిట్టేడు వరకు బస్సు టికెట్ తీసుకున్నారు. చిట్టేడులో బస్సు దిగి అన్నంబాకకు వెళ్లాల్సి ఉంది.
అయితే చిట్టేడు స్టాపింగ్ వద్ద బస్సు ఆగకుండా వెళ్లిపోయింది. ఆలస్యంగా గుర్తించిన కండక్టర్ వారిని చంద్రశేఖరపురం వద్ద దించి వెళ్లినట్లు సమాచారం. అప్పటికే రాత్రి 10 గంటలు అయింది. దీంతో నాగరాజమ్మ తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చి చిట్టేడు వద్దకు వచ్చి తమను తీసుకెళ్లాలని చెప్పింది. అయితే 10.30 గంటల సమయంలో చిట్టేడు ప్రధాన రహదారిపై మహిళ అరుపులు వినపడడంతో స్థానికులు గుమికూడారు. రక్తపు మడుగులో పడి ఉన్న నాగరాజమ్మను గుర్తించారు. ఆమె కు కొద్ది దూరంలోనే ఆమె అత్త సుబ్బమ్మ పడి ఉంది. వారిని వెంటనే ప్రైవేట్ వాహనంలో నెల్లూరుకు చికిత్స కోసం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగరాజమ్మ మృతి చెందగా ఆమె అత్త సుబ్బమ్మ అపస్మారకస్థితిలో ఉంది.
ఘటనపై పలు అనుమానాలు
చిట్టేడు దాటి రెండు కిలో మీటర్లు వచ్చేసిన వీరు చంద్రశేఖరపురం వద్ద దిగారు. వెనక్కి వెళ్లేందుకు రోడ్డుపై వెళ్లే వ్యాన్ వంటి వాహనం ఆపి అందులో ఎక్కినట్లు తెలుస్తోంది. చిట్టేడు వద్ద వాహనంలో నుంచి ఆ ఇద్దరిని గెంటి వేసినట్లు ప్రమాదం తీ రును బట్టి తెలుస్తోంది. కింద పడటంతో నాగరాజమ్మ తలకు తీవ్రగాయమైంది. ఆగకుండా వెళ్తున్న వాహనంలో నుంచి ఇద్దరు కింద పడడాన్ని చూశామని చిట్టేడు గ్రామస్తులు చెబుతున్నా రు. వాహనంలో ఏం జరిగింది.. వారిని ఎందుకు నెట్టేశారు అనేది అంతుపట్టడం లేదు. ప్రమాదంలో గాయపడిన సుబ్బమ్మ మాట్లాడలేని స్థితిలో ఉంది. ఆమె నోరు విప్పితే ప్రమాదం జరిగిన తీరుపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. చిట్టేడు నుంచి వారిని ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చిన సంబంధీకులు రక్తపు మడుగులో పడి ఉన్న ఇద్దరిని చూసి స్థానికుల సాయంతో నెల్లూరుకు తరలించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో నాగరాజమ్మ మృతి చెందినట్లు ఆమె బాబాయ్ నాగరాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై నారాయణరెడ్డి తెలిపారు. నాగరాజమ్మ మృతితో అన్నంబాకలో విషాదఛాయలు అలముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment