నవీన (ఫైల్)
బషీరాబాద్(తాండూరు) : తల్లిదండ్రులు సెల్‌ఫోన్ కొనివ్వలేదని మనస్థాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తల్లిదండ్రుల కళ్లముందే ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ సంఘటన బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిదిలోని మాసన్‌పల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. యువతి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్డె లక్ష్మ, లక్ష్మయ్య కూతురు వడ్డె నవీన(18) హైదరాబాద్‌లో ఓ ఇంట్లో పనిమనిషిగా చేస్తోంది.
అయితే గ్రామంలో చిన్నాన్న కొడుకు పెళ్లి కోసం 20 రోజుల కిందట హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చింది. మూడు రోజుల కిందట తల్లిదండ్రులతో కలిసి కర్ణాటకలోని తుల్జాపూర్ ఆలయ దర్శనానికి వెళ్లారు. శుక్రవారం రైలులో తిరిగి వస్తుండగా గుల్బర్గా దగ్గర నవీన తన సెల్‌ఫోన్‌ను పోగొట్టుకుంది. దీంతో ఏడుస్తూ దిగాలుగా ఉన్న కూతురుకు కొత్త ఫోన్ కొనిస్తామని తల్లి లక్ష్మీ సముదాయించింది.
అయితే శనివారం కొత్త సెల్‌ఫోన్ కావాలని మారం చేయడంతో ఒక్కరోజు ఆగు.. ఇంట్లో పూజ ముగిశాక తాండూరు వెళ్లి సోమవారం తీసుకుందామని తల్లి.. కూతురును మందలించింది. దీంతో మనస్థాపం చెందిన నవీన ఇంట్లో ఉన్న కిరోసిన్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకుంది. తల్లిదండ్రులు వెంటనే మంటలను ఆర్పారు. అప్పటికే తల, ముఖం ఛాతి భాగాలపై తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై లక్ష్మయ్య సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. గాయపడిన నవీనను 108లో చికిత్స కోసం తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment