సందీప్ శెట్టి
సాక్షి, బెంగళూరు : వాహన తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న ఓ వ్యక్తిని అడ్డగించిన సిబ్బంది అతనికి రూ.100 ఫైన్ వేశారు. ఈ క్రమంలో అతను చెప్పిన సమాధానం విని నోరెళ్ల బెట్టారు. ‘త్వరగా వెళ్లాలి సార్. మా ఫ్రెండ్‌ను కత్తితో పొడిచా. పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోవడానికి వెళ్తున్నా. నన్ను విడిచిపెట్టండి’ అని 26 ఏళ్ల సందీప్ శెట్టి చెప్పడంతో ట్రాఫిక్ సిబ్బందికి నమ్మబుద్ధి కాలేదు. ‘నిజం సార్. కావాలంటే చూడండి. ఇదే కత్తితో పొడిచా’ అని సందీప్ రక్తం మరకలతో ఉన్న కత్తి చూపించాడు. దీంతో కంగుతిన్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఘటనా స్థలానికి చేరుకుని బాధితున్ని ఆస్పత్రికి తరలించారు.
వివరాలు..చిక్కబళ్లపురకు చెందిన సందీప్ శెట్టి, దేవరాజ్ స్నేహితులు. దేవరాజ్ స్థానికంగా కుకింగ్ ఆయిల్ షాప్ నిర్వహిస్తున్నాడు. అయితే, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెడదామని చెప్పిన దేవరాజ్.. కొంతకాలం క్రితం సందీప్ శెట్టి నుంచి లక్ష రూపాయలు తీసుకున్నాడు. కానీ, దేవరాజ్ ఆ సొమ్మును ఎక్కడా పెట్టుబడి పెట్టలేదు. దీంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని సందీప్.. దేవరాజ్‌పై ఒత్తిడి తెచ్చాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో సందీప్ దేవరాజ్‌పై కత్తితో దాడి చేశాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయేందుకు బైక్‌పై వెళ్తున్న క్రమంలో ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. కాగా, బాధితుడి పొట్ట, వీపుపై కత్తి పోట్లున్నాయనీ, అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment