అయ్యోరు రాసిన రక్తచరిత్ర | YSRCP Activist Assassination In Srikalahasti Case latest Updates | Sakshi
Sakshi News home page

అయ్యోరు రాసిన రక్తచరిత్ర

Published Wed, Jun 10 2020 8:19 AM | Last Updated on Wed, Jun 10 2020 8:21 AM

YSRCP Activist Assassination In Srikalahasti Case latest Updates - Sakshi

భావిపౌరులను తీర్చిదిద్దాల్సిన పవిత్ర వృత్తిలో ఉండి నేరప్రవృత్తిని చాటుకున్నాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే హత్యా రాజకీయాలకు తెరతీశాడు. పాఠాలు చెప్పాల్సిన వాడు ప్రాణాలు తీసేందుకు తెగబడ్డాడు. ఆధిపత్యం కోసం మానవత్వాన్నే మరిచాడు. దాడులు, దౌర్జన్యాలకు దిగుతూ చివరకు మనిషిని చంపే స్థాయికి దిగజారాడు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త వెంకటేష్‌ హత్య కేసులో ప్రధాన ముద్దాయి పద్మనాభం కిరాతక నైజాన్ని గ్రామస్తులు వివరిస్తున్నారు. – సాక్షి, తిరుపతి 

ఉపాధ్యాయుడిగా ఉంటూ పద్మనాభం రాజకీయాలపైనే ఆసక్తి చూపేవాడు. 9ఏళ్ల క్రితం బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందాడు. వృత్తిని అడ్డుపెట్టుకుని తెరచాటు రాజకీయాలు నడిపేవాడు. ఉడమలపాడు పంచాయతీ శెనగమిట్ట హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నా విధులకు తరచుగా డుమ్మాకొట్టేవాడు. అధికారులు ఆకస్మికంగా తనిఖీలకు వస్తే తన గుట్టు బయటపడకుండా ఉండేందుకు ముందస్తు లీవ్‌ లెటర్‌ను స్కూల్‌లోనే ఉంచేవాడు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గెలుపునకు అహర్నిశలు పనిచేశాడు. అనంతరం ఆయన సహకారంతో పలు కాంట్రాక్ట్‌ పనులను చేజిక్కించుకున్నాడు. 2019 ఎన్నికల్లో సైతం బొజ్జల సుధీర్‌రెడ్డి తరపున పనిచేశాడు. సుధీర్‌ ఘోరంగా ఓడిపోవడం, అదే సమయంలో గోపాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో నియోజకవర్గానికి దూరం కావడంతో బీజేపీని ఆశ్రయించాడు. తన బంధువులు, అనుచరులకు స్థానిక బీజేపీ నేత కోలా ఆనంద్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పించాడు.  

ఎన్నికల తర్వాత బీజేపీ కండువా కప్పుకుంటున్న పద్మనాభం మేనల్లుడు (ఫైల్‌)

ఆధిపత్యం కోసమే.. 
ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా వెంకటేష్‌ ఉడమలపాడు పంచాయతీ పరిధిలో ఎదుగుతుండడాన్ని పద్మనాభం ఓర్వలేకపోయాడు. తన మేనల్లుడు, బంధువులు, అనుచరులతో కలిసి వెంకటేష్‌తో తరచూ గొడవలకు దిగేవాడు. దీనిపై వెంకటేష్, స్థానికులు కూడా పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పద్మనాభం ఉద్యోగానికి ఇబ్బంది అవుతుందని స్థానికులు మానవత్వంతో ఆలోచించి కేసు నుంచి అతడ్ని తప్పించేవారు. ఇదే అలుసుగా తీసుకుని పద్మనాభం తన బంధువులు, అనుచరుల సహకారంతో రాజకీయ నాయకుల అండ చూసుకుని రెచ్చిపోయేవాడు. చదవండి: టార్గెట్‌ వైఎస్సార్‌సీపీ! 

పంచాయతీ పరిధిలో తన ఆధిపత్యమే కొనసాగాలనే ఉద్దేశంతో వెంకటేష్‌ను అడ్డు తప్పించేందుకు పథకం వేశాడు. అందులో భాగంగా గ్రామంలో గొడవలు సృష్టించి పోలీసుల సహకారంతో వెంకటేష్‌ని ఊరు నుంచి వెళ్లగొట్టించాడు. భార్య, పిల్లల కోసం వచ్చి వెళుతున్న విషయం తెలుసుకుని నిఘా పెట్టాడు. సోమవారం దారి కాచి వెంకటేష్‌ను దారుణంగా హత్య చేసి, పద్మనాభం తన అనుచరులతో కలిసి పరారైనట్లు గ్రామస్తులు వెల్లడిస్తున్నారు.  

తప్పించుకోలేరు 
దొమ్మరపాలెంకు చెందిన వెంకటేష్‌ హత్యలో పాల్గొన్న వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాం. పద్మనాభం, ఆయన అనుచరుల కోసం ప్రత్యేక బృందాలతో తిరుపతి, శ్రీకాళహస్తితో పాటు పట్టణానికి ఆనుకుని ఉన్న నెల్లూరు జిల్లాలోనూ గాలిస్తున్నాం. త్వరలోనే వారిని అరెస్టు చేస్తాం.   
– నాగేంద్రుడు, డీఎస్పీ, శ్రీకాళహస్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement