ఆ పెళ్లి ఖర్చు రూ.55 కోట్లు! | 55-cr wedding for NRIs daughter in Kerala | Sakshi
Sakshi News home page

ఆ పెళ్లి ఖర్చు రూ.55 కోట్లు!

Published Thu, Nov 26 2015 9:48 AM | Last Updated on Sun, Sep 3 2017 1:04 PM

ఆ పెళ్లి ఖర్చు రూ.55 కోట్లు!

ఆ పెళ్లి ఖర్చు రూ.55 కోట్లు!

తిరువనంతపురం :  పెళ్లిళ్లకు అయ్యే ఖర్చును నియంత్రించాలని కేరళ మహిళ కమిషన్ ఓ వైపు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే...మరోవైపు కేరళకు చెందిన ఎన్నారై తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. అందుకోసం ఆయన అక్షరాల రూ. 55 కోట్లు ఖర్చు పెడుతున్నారు. పెళ్లి మండపం కోసమే 20 కోట్లు ఖర్చు పెట్టారంటే మిగతా వాటికి ఎంత రేంజ్‌లో ఖర్చు చేస్తున్నారో ఊహించుకోండి మరి....

వివరాల్లోకి వెళితే...  కేరళ ఎన్నారై రవి పిళ్లై... తన కుమార్తె డాకర్ట్ అరతీని కొచ్చికి చెందిన డాక్టర్ ఆదిత్య విష్ణుకు ఇచ్చి గురువారం వివాహం జరిపిస్తున్నారు. తన గారాల పట్టి వివాహ వేడుకకు  దేశంలోని ప్రముఖులతోపాటు ప్రపంచవ్యాప్తంగా 42 దేశాల నుంచి ప్రభుత్వాధినేతలను ఆయన ఆహ్వానం పలికారు.  వీఐపీలు ఈ వేడుక వద్దకు తరలించేందుకు రెండు ఛార్టర్డ్ ఫ్లైట్లు తిరువనంతపురం ఎయిర్ పోర్ట్లో ఇప్పటికే సిద్ధంగా ఉంచారు. అంతేనా 250 మంది పోలీసులు.. 350 మంది ప్రైవేట్ భద్రత సిబ్బంది ..వారి భద్రతను పర్యవేక్షించనున్నారు.

ఇక ఈ వివాహ వేడుక సందర్భంగా మలయాళ చిత్ర హీరోయిన్లు శోభన, మంజు వారియర్తో డాన్స్ ప్రోగ్రాములు. స్టిఫెన్ దేవసే ఆధర్వంలో మ్యూజికల్ షోను కూడా ఏర్పాటు చేశారు. ఇక కళ్యాణ మండపం కోసం ఏకంగా టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాహుబలి చిత్రానికి సంబంధించిన 'సెట్స్' ను వేయించారు. ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్తో బాహుబలి తరహాలో సెట్టింగ్స్ వేయించి మరీ వివాహం జరిపిస్తున్నారు. ఇందుకోసం ఎనిమిది ఎకరాలలో రూ. 20 కోట్లు ఖర్చ పెట్టి మరీ ఈ సెట్టింగ్స్ వేశారు.

కేరళకు చెందిన రవి పిళ్లై గల్ఫ్లో ఆర్పీ గ్రూప్ని నిర్వహిస్తున్నారు. ఈ గ్రూప్ ఆధ్వరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, గనులు, విద్యా, నిర్మాణ రంగాల్లో వ్యాపారం సాగుతుంది. ఆర్పీ గ్రూప్కు దేశవ్యాప్తంగా 26 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలలో 80 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది జూన్లో నిర్వహించిన సర్వేలో కేరళ ఎన్నారైల్లో అత్యధిక సంపన్నుల జాబితాలో రవి పిళ్లై మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement