ఏఎన్నార్ మృతికి నాట్స్ సంతాపం
అమెరికా: తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ, మహానటుడు, నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ప్రగాఢ సంతాపం తెలిపింది. కృష్ణా జిల్లా వెంకటరాఘవాపురంలో సెప్టెంబర్ 20, 1924న ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆయన మే 8, 1944లో సినీ నటుడిగా అరంగేట్రం చేసి, తన తుది శ్వాస విడిచే వరకు అవిశ్రాంతంగా నటిస్తునే ఉన్నారని తెలిపింది. ఆయన సినీ ప్రస్థానంలో సుమారు 256 పైగా చిత్రాలలో హీరోగా, పౌరాణిక,జానపద, సాంఘిక,సామాజిక పాత్రలలో నటించారని పేర్కొంది.
ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య , ఎన్టీఆర్ జాతీయ అవార్డు, పద్మ విభూషణ్ తదితర పురస్కారాలను ఏఎన్నార్ అందుకున్నారని నాట్స్ వెల్లడించింది. తన నటనతో తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వరరావు మరణం.. అమెరికాలోని తెలుగువారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని నాట్స్ అధ్యక్షుడు గంగాధర్ దేసు శుక్రవారం వెల్లడించారు. అక్కినేని మరణించారన్నా వార్తా ఇప్పటికీ తాము జీర్ణించుకో లేక పోతున్నామన్నారు. ఈ సందర్బంగా అక్కినేని కుటుంబానికి నాట్స్ ప్రగాఢ సానుభూతిని తెలుపుతుందని గంగాధర్ దేసు తెలిపారు.