
దుబాయిలో తెలుగు మహిళకు సత్కారం
దుబాయి: దుబాయి ఏమిరేట్లో తెలుగు ప్రవాసీయులకు సహాయక సహకారాలు అందిస్తున్నందుకు రాష్ట్రానికి చెందిన ఓ తెలుగు మహిళను దుబాయి పోలీసులు సత్కరించారు. దుబాయిలోని ప్రముఖ సామాజిక కార్యకర్త పాడే ఉమా ప్రవాస భారతీయ కార్మికులకు తరుచుగా సహాయ సహకారాలు అందిస్తుంటారు. అనేక కేసులలో దుబాయి పోలీసులకు, భారతీయ కాన్సులేటుకు కూడా తోడ్పాటు ఇస్తుంటారు.
ఈ నేపథ్యంలో దుబాయి పోలీసులు సోమవారం ఉమను సత్కరించి సన్మానించారు. ఈ మేరకు దుబాయి పోలీస్ అధికారి మేజర్ మజీద్ స్వేది ...ఆమెకు ప్రశంస పత్రంతో పాటు ఓ విలువైన బహుమతిని బహుకరించారు. కాగా హైదరాబాద్కు చెందిన ఉమ దుబాయిలో స్థిరపడ్డారు. అరబ్బీ భాష మాట్లాడే ఆమె భారతీయ కార్మికుల పక్షాన తరచుగా పోలీసులు, ఇమ్మిగ్రేషన్ కార్యాలయాలలో వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళుతుంటారు. దుబాయి పోలీసుల సత్కారంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని ఉమ అన్నారు.