(డెట్రాయిట్ నుంచి సాక్షి ప్రతినిధి జి. శ్రీనాథ్):
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ఎన్నారైలు అంబాసిడర్లుగా మారాలని నిజామాబాద్ ఎంపీ కవిత పిలుపునిచ్చారు. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ రెండు రోజు కార్యక్రమాల్లో ఎంపీ కవితతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్కు సీఎం కేసీఆర్ శుభాభినందనలు తెలుపుతూ సందేశాన్ని పంపారు. ఆ సందేశాన్ని ఆటా తెలంగాణ కన్వీనర్ వినోద్ కుకునూర్ చదివి వినిపించారు.
కేసీఆర్ సందేశం క్లుప్తంగా.. 'అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ మొదటి ప్రపంచమహాసభల నిర్వహణను అభినందిస్తున్నాను, ఆ సంస్థ తెలంగాణ సంస్కృతి వ్యాప్తికి, పరిరక్షణకు ఎంతో కృషి చేస్తోంది. ఇటు తెలంగాణ, అటు అమెరికాలో తెలంగాణ సంస్కృతిక పరిరక్షణ, వ్యాప్తికే కాక చదువు, ఇతర రంగాలలో అదే స్ఫూర్తిని కొనసాగిస్తోంది. ఈ సంస్థ వారధిలా పనిచేస్తూ,తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షిస్తున్నాను'. రాష్ట్ర అభివృద్ధికి వెన్నంటే ఉంటామని అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ సంస్థ సభ్యులు తెలిపారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను కొనసాగించారు.
భారత జాతీయగీతం, అమెరికన్ జాతీయ గీతాలను చిన్నారులు ఆలపించారు. సుద్దాల అశోక్ తేజ రాసిన తెలంగాణ పాటకు చిన్నారుల వేసిన డాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి రీచా గంగోపాధ్యాయ హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ...నేను పుట్టి పెరిగింది డెట్రాయిట్‌లోనేనని చెప్పారు. అందుకే ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని.. అన్నీ కార్యక్రమాలు చాలా బాగున్నాయన్నారు.
2001 నుంచి ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించిన కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ...ఎన్నారైల నుంచి మంచి స్పందన వస్తోందని, వీటన్నింటినీ అనుసంధానం చేయడానికే పాన్ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ప్రారంభించినట్లు చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అందరినీ కలిపి, ఏకత్వ భావనను కలిగించేదే సంస్కృతి అని చెప్పారు. మనది బ్రిలియంట్ కల్చర్ అని కొనియాడారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, అక్కడి అనుకూల పరిస్థితులను అమెరికన్ ప్రభుత్వానికి తెలియజెప్పి రాష్ట్రాభివృద్ధికి సంధానకర్తలుగా పనిచేయాలన్నారు. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఆ స్ఫూర్తినే కనబరుస్తోందని కవిత చెప్పారు.
కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, వి. ప్రకాష్ రాసిన పుస్తకాల ఆవిష్కరణతో పాటు తెలంగాణ జానపద కార్యక్రమాలు జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన పలు హాళ్లకు ప్రొఫెసర్ జయశంకర్, వైస్‌రాయ్ హాల్, దక్కన్ హాల్,లుంబినీ పార్క్, ప్రాణహిత వంటి పేర్లు పెట్టారు. తెలంగాణ పది జిల్లాలకు సంబంధించి జిల్లా చర్చ పేరుతో చర్చాకార్యక్రమం నిర్వహించారు. పొలిటికల్ ఫోరమ్ పేరుతో కూడా ఓ చర్చా కార్యక్రమం జరిగింది. దీంతో పాటు యూఎస్ పొలిటికల్ ఫారమ్ పేరుతో అమెరికా వర్తమాన రాజకీయాల మీదా చర్చ కొనసాగింది. తెలుగు సినిమాలో తెలంగాణ పాట, ఫిల్మ్ మేకింగ్ టిప్స్ అండ్ టెక్నిక్స్ మీద సెమినార్, మిషన్ భగీరథ మీద మిషన్ తెలంగాణ పేరుతో చర్చ, సెమినార్లు, తెలంగాణలో ఉన్న ఎడ్యూకేషన్ ట్రెండ్స్, యోగా ఎడ్యూకేషన్, ఎన్ఆరై మీట్ వంటి సదస్సులూ జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖనేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్ రమణ, నారదాసు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.