American Telangana Association
-
ప్రవాసాంధ్రుల ఔదార్యం, కోవిడ్ కేర్ కిట్లు పంపిణీ
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కోవిడ్ సంబంధిత ఔషధాలు, మెడికల్ ఎక్విప్మెంట్ను విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ డోనేట్ చేసింది. కాలిఫోర్నియాలోని హన్‌ఫోర్డ్ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను గుర్తించి.. వాటి పరిష్కారానికి పాటుపడుతోంది. కోవిడ్ సెకండ్ డ్రైవ్‌లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు చోట్ల వెటా ఆధ్వర్యంలో మందులు, మెడికల్ ఎక్విప్మెంట్ అందచేశారు. న్యూయార్క్, న్యూజెర్సీ ఫార్మసీల నుంచి విరాళాలు సేకరించి వాటిని రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలంలో పలు గ్రామాలకు రూ. 1. 50 లక్షల విలువైన యాంటీ బయాటిక్స్, సీ విటమిన్ ట్యాబెట్లు, సిరంజీలు డోనేట్ చేశారు. ఖమ్మం జిల్లా పల్లేరు గ్రామంలో ఐసోలేషన్ వార్డుకి ఫేస్ షీల్డ్స్, హెడ్ క్యాప్స్, ఆక్సిమీటర్లు, ఐఆర్ థర్మామీటర్లు అందించారు. ఇదే జిల్లాలో కూసుమంచి ఆరోగ్య కేంద్రానికి 7 పీపీఈ కిట్ గౌన్లలను అందించారు. సూర్యాపేట జిల్లాలోని పలు పాఠశాలలకు ఆక్సిమీటర్లు, ఇర్ థర్మామీటర్లను పంపిణీ చేయడంతో పాటు కృష్ణా జిల్లాలో 75 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు ఆక్సిమీటర్లు మరియు డిజిటల్ థర్మామీటర్లను పంపిణీ చేశారు. దీంతో పాటు తిరుపతి రుయా ఆసుపత్రికి రూ. 1.5 లక్షల విలువైన పల్స్ ఆక్సిమీటర్లు, కాంటాక్ట్‌లెస్ థర్మామీటర్లు, ఇర్ థర్మామీటర్లు, ఫేస్ షీల్డ్స్, పీపీఈ కిట్లు, హెడ్ క్యాప్స్, రేణిగుంటలోని అభయ క్షేత్రం అనాథ ఆశ్రమానికి ఒక నెలకు సరిపడా సామాన్లు, ప్రాజెక్ట్ ఆశ్రయ్కి 15 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు వెటా ద్వారా అందించారు. -
ఘనంగా వైఎస్సార్ జయంతి ఉత్సవాలు
-
అమెరికాలో ఘనంగా వైఎస్సార్ జయంతి ఉత్సవాలు
దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్సార్ 72వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అమెరికాలోని నార్త్ వెస్ట్ వైఎస్ఆర్సీపీ సీటెల్ (వాషింగ్టన్) - పోర్ట్ ల్యాండ్ విభాగం, డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ (యుఎస్ఎ) అధ్వర్యంలో సీటెల్ హిల్లైర్ పార్క్ లో ఘనంగా నిర్వాహించారు. ఈ వేడుకల్లో సీటెల్ లో ఉన్న వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో వైఎస్సార్ కు నివాళులర్పించారు. అనంతరం అశేష అభిమానులు కేక్ కట్ చేసి వైఎస్సార్ చేసిన సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల జ్యోతి ప్రజల్వన అందర్ని ఆకర్షించింది. ఈ సందర్భంగా ఏపీఎన్ఆర్టీ రీజినల్ కో ఆర్డినేట్ దుశ్యంత్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డిలు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ తన హయాంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందించిన ఆరోగ్యశ్రీ,108,104, ఫీజు రీయింబర్స్ మెంట్, ఉచిత విద్యుత్ లాంటి పథకాలతో చరిత్రలో చిరస్మరనీయుడిగా నిలిచిపోయారని కొనియాడారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ " తండ్రి ఒక అడుగు వేస్తే నేను రెండు అడుగు వేస్తా అని" వైఎస్సార్ ఆదర్శాలను పునికి పుచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. -
‘ఆటా తెలంగాణ’ నూతన కార్యవర్గం ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో ఇటీవల జరిగిన బోర్డ్ మీటింగ్‌లో ఎన్నుకున్నారు. చైర్మన్‌గా మాధవరం కరుణాకర్, అధ్యక్షుడిగా వినోద్ కుకునూరు ఎంపికయ్యారు. ఈ సమావేశంలో 25 అంశాలపై 8 గంటల పాటు చర్చ జరిపారు. ఇక నుంచి అమెరికన్ తెలంగాణ అసోసియేషన్‌ను క్లుప్తంగా ‘ఆటా తెలంగాణ’గా పిలవాలని బోర్డు ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆటా తెలంగాణ పేరునే ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆటా తెలంగాణ అధ్యక్షుడిగా భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల వివరాలను వినోద్ వివరించారు. నూతన కార్యవర్గం జూన్ 2019 నుంచి డిసెంబర్ 2020 వరకు పనిచేస్తుందని చెప్పారు. తదుపరి సమావేశం సెప్టెంబర్ 7న ఫ్లోరిడాలో జరుగుతుందని తెలిపారు. కాగా, తన రెండేళ్ల పదవీ కాలంలో ఆటా తెలంగాణ తరఫున అమెరికా, ఇండియాల్లో చేపట్టిన సేవా కార్యక్రమాలను బోర్డు పాస్ట్ ప్రెసిడెంట్ సత్యనారాయణరెడ్డి కందిమళ్ల వివరించారు. -
అరెస్టయిన భారతీయ విద్యార్థులకు ఊరట
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో ఫార్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీ కేసులో అరెస్టయిన విద్యార్థులకు ఊరట లభించింది. ఈనెల 26లోగా వారు స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు అక్కడి కోర్టు అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని ఆటా–తెలంగాణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఈ కేసులో అరెస్టయిన 16 మంది విద్యార్థులకు ఉపశమనం లభించినట్లయింది. ఫార్మింగ్టన్ నకిలీ వర్సిటీ కేసులో 20 మంది భారతీయ విద్యార్థులు అరెస్టయ్యారు. కేలహోన్ కౌంటీ జైలులో 12మంది, మన్రో కౌంటీ జైలులో 8మంది ఉన్నారు. ఈ విద్యార్థులకు అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ (ఆటా–తెలంగాణ) అండగా నిలిచింది. విద్యార్థుల తరపున వాదించేందుకు అటార్నీలను ఏర్పాటు చేసింది. ఈనేపథ్యంలో మంగళవారం తుది విచారణ జరిగింది. అనంతరం.. అరెస్టయిన వీరికి స్వచ్ఛందంగా దేశం వదిలి వెళ్లేందుకు అవకాశాన్ని ఇచ్చింది. 20 మందిలో ముగ్గురు ముందుగానే.. వాలంటరీ డిపార్చర్ అనుమతితో వెళ్లిపోయారు. 17 మందిలో 15 మందికి కోర్టు తాజాగా వాలంటరీ డిపార్చర్ అవకాశం కల్పించింది. మిగిలిన ఇద్దరిలో ఒకరికి అక్కడి ప్రభుత్వం రిమూవల్ కింద వెళ్లేందుకు అనుమతి ఇవ్వగా.. మరో విద్యార్థి అమెరికన్ సిటిజన్‌ను పెళ్లి చేసుకోవడంతో బెయిల్ బాండ్ దరఖాస్తు పెండింగ్‌లో ఉంది. ఈ 16 మంది విద్యార్థులు కోర్టు ఆదేశాలతో ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీరి తిరుగు ప్రయణానికి అవసరమైన ఏర్పాట్ల విషయంలో సహకరించాలని ఇమిగ్రేషన్ అధికారులను ఆటా ప్రతినిధులు కోరగా వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. -
ఆ ఎనిమిది మంది డిటెన్షన్‌పై విచారణ
సాక్షి, హైదరాబాద్: ఫార్మింగ్టన్ యూనివర్సిటీ కేసులో అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్న 8 మంది మధ్యవర్తుల విచారణ ప్రారంభమైంది. అమెరికా కాలమానం ప్రకారం మిచిగాన్ ఫెడరల్ న్యాయస్థానంలో సోమవారం విచారణ మొదలైంది. యూఎస్ పోలీసుల అదుపులో ఉన్న 8 మంది తెలుగు విద్యార్థుల తరఫున వాదనలు వినిపించేందుకు గాను అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఏర్పాటు చేసిన అటార్నీ ఎడ్వర్డ్ బజూకా తొలిరోజు వాదనలు వినిపించారు. విచారణ పూర్తయ్యేంతవరకు ఆ ఎనిమిది మందిని ఫెడరల్ కస్టడీలోనే ఉంచాలని, వారు బెయిల్‌పై బయటకు వస్తే యూఎస్ ఐసీఈ (స్టేట్స్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్) అధికారులు వారిని అరెస్టు చేసే అవకాశముందని బజూకా కోర్టుకు విన్నవించారు. యూఎస్ ఐసీఈ కస్టడీలో ఉంటే అది శిక్షగా పరిగణనలోకి తీసుకోరని, ఫెడరల్ కస్టడీలో ఉంటేనే శిక్షాకాలం కింద పరిగణనలోకి తీసుకుంటారని, ఈ కారణంతోనే అలా కోర్టుకు విన్నవించారని సమాచారం. అటార్నీ విన్నపాన్ని కోర్టు సానుకూలంగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. కాగా, ఈ కేసులో అరెస్టయిన ఈ3 (డిఫెండెంట్) ఫణీంద్ర కర్ణాటికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కానీ అతను ఏ1 వీసా కలిగి ఉండటంతో యూఎస్ ఐసీఈ అదుపులోకి తీసుకోలేదని తెలుగు అసోసియేషన్లు వెల్లడించాయి. గతంలో ఈ కేసులో 156 మంది విద్యార్థులను అరెస్టు చేసిన సమయంలో సేకరించిన ఫైళ్లు, ఫోన్ కాల్ డేటా వివరాలను కూడా పరిశీలించేందుకు కోర్టుకు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణలో చాలా విశ్వసనీయ విషయాలు వెల్లడవుతున్నాయని తెలుస్తోంది. తదుపరి విచారణ ఎప్పుడనేది కూడా న్యాయమూర్తి నిర్ణయం మేరకు ఉంటుందని, అది వచ్చే వారం ఉండే అవకాశముం దని సమాచారం. కాగా, ఈ ఎనిమిది మంది మధ్యవర్తుల ట్రయల్ పూర్తయిన తర్వాతే అరెస్టయిన 156 మంది విషయంలో కోర్టు విచారణ చేపట్టనుంది. త్వరగా విడుదలయ్యేలా కృషి.. ‘డిటెన్షన్ సెంటర్లో ఉన్న 8 మంది తెలుగు విద్యార్థులకు న్యాయ సహాయం చేస్తున్నాం. మా సంస్థ తరపున ఎడ్వర్డ్ బజూకా నేతృత్వంలోని బృందాన్ని అటార్నీగా నియమించాం. మిచిగాన్ ఫెడరల్ న్యాయస్థానంలో సోమవారం విచారణ జరిగింది. ఫణీంద్రకు బెయిల్ రావడం శుభసూచకం. వచ్చే వారం సెకండ్ ట్రయల్ ఉంటుంది. ఫణీంద్ర తరహాలోనే సానుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం. తెలుగు విద్యార్థులకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు మా సంస్థ తరఫున అందిస్తాం..’ –వెంకట్ మంతెన, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధి అది తప్పని వారికి తెలుసు వాషింగ్టన్: నకిలీ యూనివర్సిటీలో పేరు నమోదుచేసుకుని దొరికిపోయిన 130 మంది విద్యార్థులకు తాము చేసింది తప్పని తెలుసని అమెరికా హోం శాఖ పేర్కొంది. ఎలాగైనా అమెరికాలో నివసించాలనే వారు ఈ అక్రమానికి పాల్పడ్డారని తెలిపింది. ఫార్మింగ్టన్ వర్సిటీ కార్యకలాపాలపై విద్యార్థులకు ఎలాంటి అవగాహన లేదని, అందుకే వారు ఈ ఉచ్చులో చిక్కుకున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికా హోం శాఖ ప్రకటన భిన్నంగా రావడం గమనార్హం. ‘ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో తరగతులు, ఉపాధ్యాయులు లేరన్న సంగతి ఆ విద్యార్థులకు తెలుసు. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉండేందుకు అక్రమాలకు పాల్పడుతున్న సంగతి వారికి తెలుసు’హోం శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఫార్మింగ్టన్ వర్సిటీ బాధితుల్లో ఎక్కువ మంది తెలుగువారు ఉండటం పట్ల నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) విచారం వ్యక్తం చేసింది. 117 మందికి సాయం.. ఫార్మింగ్టన్ వర్సిటీ కేసులో అరెస్టయిన 129 మంది భారత విద్యార్థుల్లో 117 మందికి దౌత్య, న్యాయపర సాయం చేసేందుకు అనుమతి లభించిందని విదేశాంగ శాఖ వెల్లడించింది. విద్యార్థుల నిర్బంధం పై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. అమెరికా వ్యాప్తంగా 36 జైళ్లను సందర్శించి 117 మంది విద్యార్థులకు దౌత్యసాయం చేసేందుకు అనుమతులు సంపాదించామని, మిగిలిన 12 మంది కూడా సాయం చేసేందుకు ప్రయత్నాలు కొన సాగుతున్నాయని చెప్పింది. -
ఫార్మింగ్టన్ యూనివర్సీటి కేసు.. కొనసాగుతున్న విచారణ
సాక్షి, హైదరాబాద్: ఫార్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీ కేసుకు సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతోందని తెలుగు విద్యార్థుల తరుపున వాదిస్తున్న న్యాయవ్యాది ఎడ్వర్డ్ బజూకా తెలిపారు. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్(ఆటా-ATA) రమేష్ మంథన న్యాయవ్యాదిని కలిసి కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో చిక్కుకున్న ఎనిమిది మంది తెలుగు విద్యార్థుల తరపున వాదించేందుకు ఆటా ప్రత్యేకంగా న్యాయవాదిని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 130మంది విద్యార్థులు అరెస్టవ్వగా.. అందులో అధికంగా భారతీయులే ఉండటం విశేషం. వీరిలో 30మందిని ఇప్పటికే ఇండియాకు రప్పించారు. అలాగే ఈ కేసులో అరెస్ట్ అయిన ఫణి దిప్ కర్నాటికి బెయిల్ మంజూరు చేశారు. -
చికాగోలో అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ సమావేశం
చికాగో : టెక్సాస్‌లోని హోస్టన్‌లో ప్రపంచ తెలంగాణ కన్వెన్షన్ నిర్వహించడానికి అమెరికన్ తెలంగాణ అసోసియేషన్(ఆటా-తెలంగాణ) ఏర్పాట్లను ముమ్మరం చేసింది. జూన్ 29, 30, జులై 1న నిర్వహించే ఈ కార్యక్రమం కోసం చికాగోలో 3,57,200 డాలర్ల విరాళాలను సేకరించారు. విరాళాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి 400 మంది ఎన్ఆర్ఐలు హాజరయ్యారు. ఆటా తెలంగాణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నరేందర్ చిమర్ల అతిథులను సాదరంగా ఆహ్వానించారు. ప్రపంచ తెలంగాణ కన్వెన్షన్ ఏర్పాట్లను ఆటా తెలంగాణ అధ్యక్షులు సత్య కందిమల్ల వివరించారు. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ చేపట్టిన చారిటీ కార్యక్రమాలను వివరిస్తూ.. హోస్టన్ వరద బాధితుల కోసం విరాళాల ద్వారా నిధులు సమకూర్చి వారికి తమవంతు సహాయం అందించామని పేర్కొన్నారు. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఆవిర్భావం, లక్ష్యాల గురించి ఛైర్మన్ కరుణాకర్ మాధవరం తెలిపారు. అడ్‌హక్ కమిటీ శ్రీనివాస్ చాడ, బోర్డు మెమర్, క్రిష్ణ రంగరాజు, స్టాండింగ్ కమిటీ ఛైర్స్ రామచంద్రారెడ్డి ఆడె, సాయి గొంగటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడంలో తమవంతు కృషి చేశారు. ప్రపంచ తెలంగాణ కన్వెన్షన్ కోసం విరాళాలు ఇచ్చిన దాతలకు ట్రెజరర్ ప్రతాప్ చింతలపాణి కృతజ్ఞతలు తెలిపారు. రీజినల్ డైరెక్టర్ రంగారెడ్డి లెంకల, పల్లె పాట ఆటా నోటా కోఆర్డినేటర్ బిందు గొంగటి, ఆటా తెలంగాణ చికాగో వాలంటీర్లు, అతిథులను మంచి కార్యక్రమాలతో అలరించిన ప్రవీణ్ జలిగమకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
ప్రవాస స్త్రీశక్తి అవార్డుకు ఉపసన
అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ప్రవాసి మిత్ర మాస పత్రిక సంయుక్తంగా ప్రవాసి బతుకమ్మ అవార్డును ప్రకటించగా యూఏఈలోని గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్‌లో సభ్యురాలైన ఉపసన రాబర్ట్ ఎంపికైనట్లు అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు కొండ రాంమోహన్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన ఉపసన గత కొన్నేళ్ల క్రితం యూఏఈ దేశంలో స్థిరపడి దుబాయిలో ఉద్యోగం చెస్తు గల్ఫ్ సంక్షేమ సంఘంలో కీలకపాత్ర పోషిస్తూ సామాజిక సేవలో పాల్గొంటూ పలు కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను స్త్రీశక్తి అవార్డుకు ఎంపికైంది. అక్టోబర్ 2న హైదరాబాధ్‌లోని ప్రవాసి బతుకమ్మ సందర్భంగా ఇచ్చే అవార్డుల్లో భాగంగా బేగంపేటలోని జీవనజ్యోతి క్యాంపు ఆఫీసులో డెప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. ఈ సందర్భంగాఉపసనను గల్ఫ్ సంక్షేమ సంఘం ప్రతినిధులు జువ్వాడి శ్రీనివాసరావు, రాజాశ్రీనివాస్, శ్రీనివాస్‌శర్మ, సదానంద్ తదితరులు అభినందించారు. -
రాష్ట్రాభివృద్ధికి అంబాసిడర్లుగా మారాలి: ఎంపీ కవిత
(డెట్రాయిట్ నుంచి సాక్షి ప్రతినిధి జి. శ్రీనాథ్): తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ఎన్నారైలు అంబాసిడర్లుగా మారాలని నిజామాబాద్ ఎంపీ కవిత పిలుపునిచ్చారు. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ రెండు రోజు కార్యక్రమాల్లో ఎంపీ కవితతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్‌కు సీఎం కేసీఆర్ శుభాభినందనలు తెలుపుతూ సందేశాన్ని పంపారు. ఆ సందేశాన్ని ఆటా తెలంగాణ కన్వీనర్ వినోద్ కుకునూర్ చదివి వినిపించారు. కేసీఆర్ సందేశం క్లుప్తంగా.. 'అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ మొదటి ప్రపంచమహాసభల నిర్వహణను అభినందిస్తున్నాను, ఆ సంస్థ తెలంగాణ సంస్కృతి వ్యాప్తికి, పరిరక్షణకు ఎంతో కృషి చేస్తోంది. ఇటు తెలంగాణ, అటు అమెరికాలో తెలంగాణ సంస్కృతిక పరిరక్షణ, వ్యాప్తికే కాక చదువు, ఇతర రంగాలలో అదే స్ఫూర్తిని కొనసాగిస్తోంది. ఈ సంస్థ వారధిలా పనిచేస్తూ,తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షిస్తున్నాను'. రాష్ట్ర అభివృద్ధికి వెన్నంటే ఉంటామని అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ సంస్థ సభ్యులు తెలిపారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను కొనసాగించారు. భారత జాతీయగీతం, అమెరికన్ జాతీయ గీతాలను చిన్నారులు ఆలపించారు. సుద్దాల అశోక్ తేజ రాసిన తెలంగాణ పాటకు చిన్నారుల వేసిన డాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి రీచా గంగోపాధ్యాయ హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ...నేను పుట్టి పెరిగింది డెట్రాయిట్లోనేనని చెప్పారు. అందుకే ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని.. అన్నీ కార్యక్రమాలు చాలా బాగున్నాయన్నారు. 2001 నుంచి ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించిన కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ...ఎన్నారైల నుంచి మంచి స్పందన వస్తోందని, వీటన్నింటినీ అనుసంధానం చేయడానికే పాన్ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ప్రారంభించినట్లు చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అందరినీ కలిపి, ఏకత్వ భావనను కలిగించేదే సంస్కృతి అని చెప్పారు. మనది బ్రిలియంట్ కల్చర్ అని కొనియాడారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, అక్కడి అనుకూల పరిస్థితులను అమెరికన్ ప్రభుత్వానికి తెలియజెప్పి రాష్ట్రాభివృద్ధికి సంధానకర్తలుగా పనిచేయాలన్నారు. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఆ స్ఫూర్తినే కనబరుస్తోందని కవిత చెప్పారు. కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, వి. ప్రకాష్ రాసిన పుస్తకాల ఆవిష్కరణతో పాటు తెలంగాణ జానపద కార్యక్రమాలు జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన పలు హాళ్లకు ప్రొఫెసర్ జయశంకర్, వైస్రాయ్ హాల్, దక్కన్ హాల్,లుంబినీ పార్క్, ప్రాణహిత వంటి పేర్లు పెట్టారు. తెలంగాణ పది జిల్లాలకు సంబంధించి జిల్లా చర్చ పేరుతో చర్చాకార్యక్రమం నిర్వహించారు. పొలిటికల్ ఫోరమ్ పేరుతో కూడా ఓ చర్చా కార్యక్రమం జరిగింది. దీంతో పాటు యూఎస్ పొలిటికల్ ఫారమ్ పేరుతో అమెరికా వర్తమాన రాజకీయాల మీదా చర్చ కొనసాగింది. తెలుగు సినిమాలో తెలంగాణ పాట, ఫిల్మ్ మేకింగ్ టిప్స్ అండ్ టెక్నిక్స్ మీద సెమినార్, మిషన్ భగీరథ మీద మిషన్ తెలంగాణ పేరుతో చర్చ, సెమినార్లు, తెలంగాణలో ఉన్న ఎడ్యూకేషన్ ట్రెండ్స్, యోగా ఎడ్యూకేషన్, ఎన్ఆరై మీట్ వంటి సదస్సులూ జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖనేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్ రమణ, నారదాసు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
అమెరికా తెలంగాణ మహా సభలు షురూ
(డెట్రాయిట్ నుంచి సాక్షి ప్రతినిధి జి. శ్రీనాథ్): అమెరికా తెలంగాణ అసోసియేషన్ తొలి ప్రపంచ మహాసభలు తెలంగాణ సాంస్కృతిక వారసత్వం ఉట్టిపడేలా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అమెరికా తెలంగాణ సంఘం తొలి రోజు కార్యక్రమాల్లో ధూంధాం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రసమయి బాలకిషన్ నేతృత్వంలో తెలంగాణ కళాకారులు సాంప్రదాయ రీతిలో చేసిన నృత్యాలు, పాడిన పాటలు ఆహుతలును అలరించాయి. తెలంగాణ ఉద్యమం సాగిన తీరు, ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన ఉద్యమ కారుల గురించి, అలాగే ఇప్పుడు బంగారు తెలంగాణ దిశగా చేస్తున్న ప్రయత్నాలను కళా ప్రదర్శనలతో చూపించారు. సాంస్కృతిక వారసత్వంలో తాము ఏ మాత్రం తీసిపోమని నిరూపించారు ఎన్నారైల పిల్లలు. క్లాస్, మాస్ గీతాలకు అద్భుతంగా డాన్సులు చేశారు. అమెరికన్తెలంగాణ అసోసియేషన్ ఆవిర్భావ ఆవశ్యకత గురించి అమెరికన్ అసోసియేషన్ వ్యవస్థాపకులలో ఒకరు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ వినోద్ కుకునూర్ వివరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అమెరికా ఎన్నారైలు తెలంగాణ వచ్చాక కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్దిలో తమ వంతు పాత్రపోషించాలనే ఉద్దేశంతోనే అమెరికన్ తెలంగాణ అసోసియేషనను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రపంచం వ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులకు ఈ కార్యక్రమం వారధిగా పనిచేస్తుందని చెప్పారు. అనంతరం డెట్రాయిట్లో ఉన్న తెలంగాణ పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. రసమయి బాలకిషన్ గ్రూప్ ఆటపాటలతోఆకట్టుంది. డెట్రాయిట్‌లోని సబ్అర్బన్ కన్వెషన్ ప్లేస్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఇదే ఆవరణలో దుస్తులు, ఆభరణాలతోపాటూ రకరకాల వస్తువుల స్టాల్స్ కూడా ప్రారంభించారు. మూడు రోజులు పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. ఎన్ఆర్ఐ పిల్లల చేసిన ఫ్యాషన్ షో ఈ కార్యక్రమానికి హైలెట్‌గా నిలిచింది. తెలంగాణ భోజనాలకు అమెరికా అడ్డు..! తొలి తెలుగు ప్రపంచ మహాసభలు నిర్వహిస్తుండడంతో భోజన ఏర్పాట్లు భారీగానే చేశారు. సాయంత్రం బాంకెట్ ఉండగా.. మధ్యాహ్నం కల్లా అన్ని వంటలు సిద్ధం చేశారు. అయితే అనుకోకుండా అమెరికా ఫుడ్ ఇన్ స్పెక్టర్లు చివరి క్షణంలో తనిఖీలు చేసి కొన్ని వంటకాలను అడ్డుకున్నారు. దీంతో ఆహుతులకు ఇబ్బందులు కలగకుండా.. అప్పటికప్పుడు మళ్లీ భోజనాలు సిద్ధం చేసారు. ఆటా తెలంగాణ తొలి ప్రపంచ మహాసభలను నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని, తెలంగాణకు ఈ సదస్సు ఉపయోగపడేలా ప్రయత్నిస్తున్నామని అమెరికా తెలంగాణ సంఘం అధ్యక్షుడు కొండా రామ్మోహన్ అన్నారు. అమెరికా తెలంగాణ సంఘం తరపున రైతు సదస్సులు నిర్వహించి తక్కువ ఖర్చులో వ్యవసాయం ఎలా చేయాలి, లాబసాటిగా దిగుబడి ఎలా రాబట్టాలి అన్న దానిపై అన్నదాతలకు అవగాహన కల్పిద్దామనుకుంటున్నామన్నారు. అలాగే ప్రీడిపోర్టేషన్ (అన్ని ఉన్నా ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్థులను పంపుతుండడంపైనా) ఒక శిక్షణ తరగతులు నిర్వహించాలకుంటున్నామని తెలిపారు. తెలంగాణ నుంచి వచ్చే విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అమెరికా తెలంగాణ అసోసియేషన్ తొలి ప్రపంచ మహాసభలుకు తెలంగాణ డిప్యూటీ సీం కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శాసనమండలి చైర్మన్స్వామిగౌడ్, కరీంనగర్ జిల్లా మనాకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, గొరేటి వెంకన్న, ఎంపి జితేందర్‌రెడ్డి, యార్లలక్ష్మీ ప్రసాద్, ప్రముఖ పాటల రచయిత సుద్దాలఅశోక్ తేజ, కవి నందిని సిద్ధా రెడ్డి వంటి ప్రముఖుల సమక్షంలో కార్యక్రమం జ్యోతి ప్రజ్వలతో ప్రారంభమైంది. వి.ప్రకాష్, నారదాసు లక్ష్మణ్,ప్రముఖ కూచిపూడి కళారాణి పద్మజారెడ్డి, తెలుగు సినీ నేపథ్య సంగీతకారుడు అనూప్‌రూబెన్స్, నేపథ్యగయనీమణులు కౌసల్య, మాళవిక, గాయకుడు పార్థసారథి, ఇంకా కారెక్టర్ ఆర్టిస్టు సురేఖావాణి, రజిత, ప్రియ వంటి బుల్లి తెరనటీనటులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
ఏటీఏ డెట్రాయిట్ సమావేశానికి ఏర్పాట్లు పూర్తి
డెట్రాయిట్: ప్రథమ ప్రపంచ తెలంగాణ మహా సభలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమెరికా తెలంగాణ సంఘం(ఏటీఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ వేడుకలు శుక్రవారం నుంచి మూడు రోజులపాటూ(8,9,10 తేదీల్లో) జరుగనున్నాయి.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ వేడుకలను నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఆటా, పాటలతో పాటూ పలు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఓల్డ్ సిటీ బోనాలను కూడా డెట్రాయిట్ లో నిర్వహిస్తారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి డెట్రాయిట్కు తీసుకువచ్చారు. -
జూలై 8 నుంచి ప్రపంచ తెలంగాణ మహాసభలు
పంజగుట్ట (హైదరాబాద్) : తెలంగాణ చరిత్రను ప్రపంచ దేశాలకు తెలియచెప్పేందుకు అమెరికన్ తెలంగాణ సంఘం(ఆటా) కృషి చేస్తుందని ఆటా ప్రతినిధులు తెలిపారు. ఆటా ఆధ్వర్యంలో జులై 8 నుంచి 10వ తేదీ వరకు అమెరికాలోని డెట్రాయిట్ మహానగరంలో 'ప్రథమ ప్రపంచ తెలంగాణ మహాసభలు' నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. సోమవారం లక్డీకాపూల్‌లోని హోటల్ సెంట్రల్ కోర్టులో మహాసభల పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాసభల నిర్వాహకులు రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ... అమెరికాలోని 25 ప్రాంతీయ తెలంగాణ సంఘాలు కలిసి నెల క్రితమే ఆటా ఏర్పడిందని, ఇంత తక్కువ సమయంలోనే ప్రపంచ మహాసభలు నిర్వహిస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నామన్నారు. ఈ సభలకు 25 దేశాల నుంచి తెలంగాణ, తెలుగువారు సుమారు 7 వేల మంది హాజరు కానున్నట్లు తెలిపారు. కేవలం డెట్రాయిట్ నగరంలోనే 8 వేలు, అమెరికా మరికొన్ని రాష్ట్రాల్లో సుమారు 20 వేలమంది తెలంగాణ కుటుంబాలు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి, ఇతర మంత్రులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై రెండేళ్లకోసారి ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జ్యోతి రెడ్డి చింతలపాని, రమాదేవి నీలారపు, కె.పద్మజారెడ్డి, బి.రామచంద్రారెడ్డి, రావు నెరుసు తదితరులు పాల్గొన్నారు.