అమెరికా తెలంగాణ మహా సభలు షురూ
(డెట్రాయిట్ నుంచి సాక్షి ప్రతినిధి జి. శ్రీనాథ్):
అమెరికా తెలంగాణ అసోసియేషన్ తొలి ప్రపంచ మహాసభలు తెలంగాణ సాంస్కృతిక వారసత్వం ఉట్టిపడేలా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అమెరికా తెలంగాణ సంఘం తొలి రోజు కార్యక్రమాల్లో ధూంధాం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రసమయి బాలకిషన్ నేతృత్వంలో తెలంగాణ కళాకారులు సాంప్రదాయ రీతిలో చేసిన నృత్యాలు, పాడిన పాటలు ఆహుతలును అలరించాయి. తెలంగాణ ఉద్యమం సాగిన తీరు, ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన ఉద్యమ కారుల గురించి, అలాగే ఇప్పుడు బంగారు తెలంగాణ దిశగా చేస్తున్న ప్రయత్నాలను కళా ప్రదర్శనలతో చూపించారు. సాంస్కృతిక వారసత్వంలో తాము ఏ మాత్రం తీసిపోమని నిరూపించారు ఎన్నారైల పిల్లలు. క్లాస్, మాస్ గీతాలకు అద్భుతంగా డాన్సులు చేశారు.
అమెరికన్‌తెలంగాణ అసోసియేషన్ ఆవిర్భావ ఆవశ్యకత గురించి అమెరికన్ అసోసియేషన్ వ్యవస్థాపకులలో ఒకరు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ వినోద్ కుకునూర్ వివరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అమెరికా ఎన్నారైలు తెలంగాణ వచ్చాక కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్దిలో తమ వంతు పాత్రపోషించాలనే ఉద్దేశంతోనే అమెరికన్ తెలంగాణ అసోసియేషనను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రపంచం వ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులకు ఈ కార్యక్రమం వారధిగా పనిచేస్తుందని చెప్పారు.
అనంతరం డెట్రాయిట్‌లో ఉన్న తెలంగాణ పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. రసమయి బాలకిషన్ గ్రూప్ ఆటపాటలతోఆకట్టుంది. డెట్రాయిట్‌లోని సబ్అర్బన్ కన్వెషన్ ప్లేస్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఇదే ఆవరణలో దుస్తులు, ఆభరణాలతోపాటూ రకరకాల వస్తువుల స్టాల్స్ కూడా ప్రారంభించారు. మూడు రోజులు పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. ఎన్ఆర్ఐ పిల్లల చేసిన ఫ్యాషన్ షో ఈ కార్యక్రమానికి హైలెట్‌గా నిలిచింది.
తెలంగాణ భోజనాలకు అమెరికా అడ్డు..!
తొలి తెలుగు ప్రపంచ మహాసభలు నిర్వహిస్తుండడంతో భోజన ఏర్పాట్లు భారీగానే చేశారు. సాయంత్రం బాంకెట్ ఉండగా.. మధ్యాహ్నం కల్లా అన్ని వంటలు సిద్ధం చేశారు. అయితే అనుకోకుండా అమెరికా ఫుడ్ ఇన్ స్పెక్టర్లు చివరి క్షణంలో తనిఖీలు చేసి కొన్ని వంటకాలను అడ్డుకున్నారు. దీంతో ఆహుతులకు ఇబ్బందులు కలగకుండా.. అప్పటికప్పుడు మళ్లీ భోజనాలు సిద్ధం చేసారు.
ఆటా తెలంగాణ తొలి ప్రపంచ మహాసభలను నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని, తెలంగాణకు ఈ సదస్సు ఉపయోగపడేలా ప్రయత్నిస్తున్నామని అమెరికా తెలంగాణ సంఘం అధ్యక్షుడు కొండా రామ్మోహన్ అన్నారు. అమెరికా తెలంగాణ సంఘం తరపున రైతు సదస్సులు నిర్వహించి తక్కువ ఖర్చులో వ్యవసాయం ఎలా చేయాలి, లాబసాటిగా దిగుబడి ఎలా రాబట్టాలి అన్న దానిపై అన్నదాతలకు అవగాహన కల్పిద్దామనుకుంటున్నామన్నారు. అలాగే ప్రీడిపోర్టేషన్ (అన్ని ఉన్నా ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్థులను పంపుతుండడంపైనా) ఒక శిక్షణ తరగతులు నిర్వహించాలకుంటున్నామని తెలిపారు. తెలంగాణ నుంచి వచ్చే విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అమెరికా తెలంగాణ అసోసియేషన్ తొలి ప్రపంచ మహాసభలుకు తెలంగాణ డిప్యూటీ సీం కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శాసనమండలి చైర్మన్‌స్వామిగౌడ్, కరీంనగర్ జిల్లా మనాకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, గొరేటి వెంకన్న, ఎంపి జితేందర్‌రెడ్డి, యార్లలక్ష్మీ ప్రసాద్, ప్రముఖ పాటల రచయిత సుద్దాలఅశోక్ తేజ, కవి నందిని సిద్ధా రెడ్డి వంటి ప్రముఖుల సమక్షంలో కార్యక్రమం జ్యోతి ప్రజ్వలతో ప్రారంభమైంది. వి.ప్రకాష్, నారదాసు లక్ష్మణ్,ప్రముఖ కూచిపూడి కళారాణి పద్మజారెడ్డి, తెలుగు సినీ నేపథ్య సంగీతకారుడు అనూప్‌రూబెన్స్, నేపథ్యగయనీమణులు కౌసల్య, మాళవిక, గాయకుడు పార్థసారథి, ఇంకా కారెక్టర్ ఆర్టిస్టు సురేఖావాణి, రజిత, ప్రియ వంటి బుల్లి తెరనటీనటులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.