ఆక్లాండ్లో ఘనంగా జయశంకర్ జయంతి
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజీలాండ్(టీఏఎన్జెడ్) ఆధ్వర్యంలో ఆక్లాండ్ నగరంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి 82వ జయంతిని ఘనంగా నిర్వహించారు. జయశంకర్ సార్ చిత్రపటం వద్ద దీపం వెలిగించి, ఫొటోకు పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఏఎన్జెడ్ ఇన్ ఛార్జ్ ప్రెసిడెంట్ శ్రీరాంమోహన్ దంతాల మాట్లాడుతూ... తెలంగాణ సిద్ధాంతకర్త అయిన జయశంకర్ సార్ త్రికరణ శుద్ధిగా తన జీవితాంతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడిన వ్యక్తి అని ఆయన త్యాగాన్ని కొనియాడారు. ఎందరికో ఆయన స్ఫూర్తినిచ్చారని, మనమంతా కలిసికట్టుగా తెలంగాణ బిడ్డలుగా బంగారు తెలంగాణకై పాటుపడాలని పిలుపునిచ్చారు.
టీఏఎన్జెడ్ వైఎస్ ప్రెసిడెంట్ ఉమా సల్వాడి మాట్లాడుతూ.. నేడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి మూలం, తెలంగాణ ప్రజల ఉనికికి కారణం జయశంకర్ సార్ అని పేర్కొన్నారు. ఎలాంటి ధనధాన్యాలు, పేరు ప్రతిష్టలు ఆశించకుండా ఉద్యమంలో ముందుండి అందరినీ నడిపించారని చెప్పారు. టీఏఎన్జెడ్ ట్రెజరర్ దయానంద్ కటకం మాట్లాడుతూ.. జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని ఇక్కడికి విచ్చేసి కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట్ నర్సింహారావు పుప్పాల, మన్నెం నవీన్ కుమార్, రమేష్ కలకుంట్ల, శ్రీనివాస్.పి, రామారావు రాచకొండ, రమాదేవి సల్వాజి, శశి, టీఏఎన్జెడ్ కు చెందిన ఇతర సభ్యులు పాల్గొన్నారు.