professor jayashankar jayanthi
-
తెలంగాణ భవన్లో ప్రొ.జయశంకర్ జయంతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో గురువారం పలువురు పార్టీ నేతలు నివాళి అర్పించారు. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ తెలంగాణ భవన్‌లోని జయశంకర్ విగ్రహానికి పూలు సమర్పించారు. ప్రత్యేక గీతం విడుదల తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం పరితపించారని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి రాష్ట్ర కార్యాలయంలో జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జయశంకర్‌పై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని కవిత ఆవిష్కరించారు. -
జయశంకర్ సార్ యాదిలో..
సాక్షి, భూపాలపల్లి: ప్రొఫెసర్ జయశంకర్ తన గురువని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాలుపంచుకోవాలని ఎప్పుడూ చెప్పేవారని, ఆయన సూచనల మేరకే తాను టీఆర్ఎస్లో చేరానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం భూపాలపల్లి పట్టణంలోని జయశంకర్ విగ్రహానికి పూల మాలలు వేశారు. అనంతరం మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ తన తండ్రి క్లాస్మేట్ అని, సార్ వద్ద తాను కొద్ది రోజులు చదువుకున్నానని తెలిపారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు. సీఎం కే.చంద్రశేఖర్‌రావుకు కుడి భుజంలా ఉండి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉర్రూతలూగించారని గుర్తు చేశారు. సార్ బ్రతికి ఉంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించినందుకు చాలా హ్యాపీగా ఫీలయ్యేవారన్నారు. జయశంకర్ పేరు మీద భూపాలపల్లి జిల్లాను ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. మొక్కలు నాటాలి.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి రాష్ట్రాన్ని పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో మంజూర్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న జయశంకర్ ఎకో పార్కు పనులను పరిశీలించారు. అనంతరం పార్కు ఆవరణలో మొక్కలు నాటారు. మంత్రి మాట్లాడుతూ.. జయశంకర్ పార్కులో మంచి సౌకర్యాలు కల్పించి భూపాలపల్లి వాసులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చూడాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. వానలు సమృద్ధిగా కురువాలంటే ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటాలన్నారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని సూచించారు. అనంతరం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలు, పొలం గట్లు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పచ్చని వాతావరణం నెలకొనేలా మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. అనంతరం తెలంగాణకు హరితహారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గ్రామ పంచాయతీ నర్సరీ జాబితా 2019 బుక్‌లెట్‌ను మంత్రి దయాకర్‌రావు విడుదల చేశారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, డీఎఫ్ఓ ప్రదీప్‌కుమార్‌శెట్టి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్లు జక్కు శ్రీహర్షిణి, గండ్ర జ్యోతి, ఎఫ్డీఓ సారయ్య, టీఆర్ఎస్ నాయకులు క్యాతరాజు సాంబమూర్తి, కొత్త హరిబాబు, కటకం జనార్దన్, పైడిపెల్లి రమేష్, శిరుప అనిల్, పిల్లలమర్రి నారాయణ, ముంజాల రవీందర్, మంథెన రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
జయశంకర్ సార్ స్మృతిలో..
ఆత్మకూరు (పరకాల): తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు డిసెంబర్ 9 ప్రకటన తర్వాత విద్యార్థులు జరుపుకున్న సంబరం మర్చిపోలేని గొప్ప జ్ఞాపకం. వారి భవిష్యత్ కలలతో ఆడుకున్నది ఎవరు? వారి ఆశలతో ఆడుకొని వారి శవాలపై ప్రమాణం చేసిన రాజకీయనాయకులకు వాళ్ల ఉసురు తగలకుండా పోతుందా..అని విశ్వవిద్యాలయాల విద్యార్థుల గురించి మదనపడ్డ గురువర్యులు ఆచార్య కొత్తపల్లి జయశంకర్. ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష గురించి ఏమన్నారంటే.. మా వనరులు మాకున్నాయి.మా వనరులపై మాకు అధికారం కావాలి.యాచక దశ నుంచి శాసించే దశకు తెలంగాణ చేరుకోవాలి. మా తెలంగాణ మాకు కావాలి అన్నారు. అక్కంపేటలో పుట్టిన ఆచార్యుడు... ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ప్రస్తుత వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో లక్ష్మికాంతరావు, మహాలక్ష్మి దంపతులకు రెండో సంతానంగా ఆగస్టు 6,1934న జన్మించాడు. బాల్య దశ నుంచి ఉద్యమ స్వభావం కలిగిన వ్యక్తి కావడంతో వివాహం చేసుకోకుండా సొంత కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోకుండా బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు. విద్యాభ్యాసం.. పుట్టిన గ్రామంలో రెండోతరగతి వరకు ప్రాథమిక విద్యను అభ్యసించి ఆపై చదువుకు హన్మకొండకు వెళ్లారు. అక్కడే ఉర్దూ మీడియంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఇంటర్, డిగ్రీ చదివారు. అనంతరం బెనారస్, అలీఘడ్ విశ్వవిద్యాలయాల నుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా పుచ్చుకుని ఉస్మానియా వర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు. బోధనా రంగంలో.. 1975నుండి1979వరకు సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు.1979 నుంచి 1981వరకు కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా ,1982 నుంచి 1991వరకు సీఫెల్ రిజిస్ట్రార్‌గా 1994వరకు ఇదే యూనివర్సిటీలో వీసీగా పనిచేశారు. ఉద్యమ ఆలోచన మొదలైందిలా.. మొట్టమొదట హైదరాబాద్ రాష్ట్రంలో జయశంకర్‌కు హైదరాబాద్‌లో ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చింది. అయితే సెలవులు రావడంతో ఇంకా జాయిన్‌కాలేదు. అప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది. అప్పుడు జయశంకర్ సార్ జాయిన్ కావడానికి వెళ్లగా తిరిగి రిపోర్ట్ చేయమని చెప్పారు. జయశంకర్ ఎందుకని ప్రశ్నిస్తే జీతాలు మారాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ వారికి ఎంత అన్యాయమని జరుగుతుందని అప్పుడే సార్ మదిలో బీజం పడింది. ఇదే ఆయనను సిద్ధాంతకర్తగా తయారు చేసింది. ఎమర్జెన్సీలో సాహసాలు.. సార్ సీకేఎం కళాశాలలో పనిచేస్తున్న సమయంలో ఎమర్జెన్సీ ప్రారంభమైంది. విప్లవ కవి వరవరరావు కూడా ఇదే కళాశాలలో పని చేసేవారు. ఆ సమయంలో సార్ చాకచాక్యంతో అధ్యాపకులను, విద్యార్థులను తన సామర్థ్యాలతో నిర్బంధం నుంచి కాపాడారు. విద్యార్థులను గుర్తుపెట్టుకుని పిలిచేవారు..సార్ పనిచేసిన మల్టీపర్పస్ పాఠశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకు తన దగ్గర చదువుకున్న ప్రతి విద్యార్థి పేరు గుర్తుపెట్టుకొని పిలిచేవారు. ఎంతో మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో సార్ వెంట నడిచారు. వరంగల్‌లో ఉపన్యాసం పెట్టించారు.. 1952లో విశాలాంధ్రకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్న సమయంలో సార్ అయ్యదేవర కాళేశ్వర్రావు ద్వారా ఉపన్యాసం ఇప్పించారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లో అఫ్జల్‌గంజ్‌లో జరిగిన సమావేశానికి సార్ వెళుతుండగా భువనగిరి వద్ద బస్‌ఫెయిల్ కావడంతో వెళ్లలేదు. అప్పుడు కాల్పుల్లో ఏడుగురు విద్యార్థులు బలయ్యారు. తాను వెళితే అమరుల జాబితాలో ఉండేవాడినని సార్ పలు సమావేశాల్లో ప్రస్తావించారు. ఇడ్లీ సాంబర్ గో బ్యాక్, నాన్‌ముల్కీలో కీలకపాత్ర పోషించారు. ఎన్నో రచనలు.. జయశంకర్ తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్, తెలంగాణలో ఏం జరుగుతోంది, వక్రీకరణలు–వాస్తవాలు, తల్లడిల్లుతున్న తెలంగాణ, తెలంగాణ వంటి ఎన్నో పుస్తకాలు రాశారు. నిరంతరం ఉద్యమ భావాలే.. జయశంకర్‌కు 2011జూన్21న తుదిశ్వాస విడిచేవరకు తెలంగాణ మీదే ధ్యాస ఉండేది. నిరంతరం ఉద్యమ భావాలను రగిలిస్తూ జీవించారు. పాఠశాలకు స్థలం విరాళం.. సార్ పుట్టిన గ్రామంలో జెడ్పీహైస్కూల్‌కు గ్రౌండ్ కోసం వారి సొంత స్థలం 1.10 ఎకరాల భూమిని విరాళంగా అందజేశారు. -
ఆక్లాండ్‌లో ఘనంగా జయశంకర్ జయంతి
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజీలాండ్(టీఏఎన్జెడ్) ఆధ్వర్యంలో ఆక్లాండ్ నగరంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి 82వ జయంతిని ఘనంగా నిర్వహించారు. జయశంకర్ సార్ చిత్రపటం వద్ద దీపం వెలిగించి, ఫొటోకు పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఏఎన్జెడ్ ఇన్ ఛార్జ్ ప్రెసిడెంట్ శ్రీరాంమోహన్ దంతాల మాట్లాడుతూ... తెలంగాణ సిద్ధాంతకర్త అయిన జయశంకర్ సార్ త్రికరణ శుద్ధిగా తన జీవితాంతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడిన వ్యక్తి అని ఆయన త్యాగాన్ని కొనియాడారు. ఎందరికో ఆయన స్ఫూర్తినిచ్చారని, మనమంతా కలిసికట్టుగా తెలంగాణ బిడ్డలుగా బంగారు తెలంగాణకై పాటుపడాలని పిలుపునిచ్చారు. టీఏఎన్జెడ్ వైఎస్ ప్రెసిడెంట్ ఉమా సల్వాడి మాట్లాడుతూ.. నేడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి మూలం, తెలంగాణ ప్రజల ఉనికికి కారణం జయశంకర్ సార్ అని పేర్కొన్నారు. ఎలాంటి ధనధాన్యాలు, పేరు ప్రతిష్టలు ఆశించకుండా ఉద్యమంలో ముందుండి అందరినీ నడిపించారని చెప్పారు. టీఏఎన్జెడ్ ట్రెజరర్ దయానంద్ కటకం మాట్లాడుతూ.. జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని ఇక్కడికి విచ్చేసి కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట్ నర్సింహారావు పుప్పాల, మన్నెం నవీన్ కుమార్, రమేష్ కలకుంట్ల, శ్రీనివాస్.పి, రామారావు రాచకొండ, రమాదేవి సల్వాజి, శశి, టీఏఎన్జెడ్ కు చెందిన ఇతర సభ్యులు పాల్గొన్నారు.