జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మంత్రి
సాక్షి, భూపాలపల్లి: ప్రొఫెసర్ జయశంకర్ తన గురువని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాలుపంచుకోవాలని ఎప్పుడూ చెప్పేవారని, ఆయన సూచనల మేరకే తాను టీఆర్‌ఎస్‌లో చేరానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం భూపాలపల్లి పట్టణంలోని జయశంకర్ విగ్రహానికి పూల మాలలు వేశారు. అనంతరం మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ తన తండ్రి క్లాస్‌మేట్ అని, సార్ వద్ద తాను కొద్ది రోజులు చదువుకున్నానని తెలిపారు.
రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు. సీఎం కే.చంద్రశేఖర్‌రావుకు కుడి భుజంలా ఉండి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉర్రూతలూగించారని గుర్తు చేశారు. సార్ బ్రతికి ఉంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించినందుకు చాలా హ్యాపీగా ఫీలయ్యేవారన్నారు. జయశంకర్ పేరు మీద భూపాలపల్లి జిల్లాను ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు.
మొక్కలు నాటాలి..
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి రాష్ట్రాన్ని పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో మంజూర్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న జయశంకర్ ఎకో పార్కు పనులను పరిశీలించారు. అనంతరం పార్కు ఆవరణలో మొక్కలు నాటారు. మంత్రి మాట్లాడుతూ.. జయశంకర్ పార్కులో మంచి సౌకర్యాలు కల్పించి భూపాలపల్లి వాసులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చూడాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. వానలు సమృద్ధిగా కురువాలంటే ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటాలన్నారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని సూచించారు.
అనంతరం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలు, పొలం గట్లు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పచ్చని వాతావరణం నెలకొనేలా మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. అనంతరం తెలంగాణకు హరితహారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గ్రామ పంచాయతీ నర్సరీ జాబితా 2019 బుక్‌లెట్‌ను మంత్రి దయాకర్‌రావు విడుదల చేశారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, డీఎఫ్‌ఓ ప్రదీప్‌కుమార్‌శెట్టి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు జక్కు శ్రీహర్షిణి, గండ్ర జ్యోతి, ఎఫ్‌డీఓ సారయ్య, టీఆర్‌ఎస్ నాయకులు క్యాతరాజు సాంబమూర్తి, కొత్త హరిబాబు, కటకం జనార్దన్, పైడిపెల్లి రమేష్, శిరుప అనిల్, పిల్లలమర్రి నారాయణ, ముంజాల రవీందర్, మంథెన రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment