జయశంకర్‌ సార్‌ స్మృతిలో.. | 84th Birthday Of Jayashankar | Sakshi
Sakshi News home page

జయశంకర్‌ సార్‌ స్మృతిలో..

Published Mon, Aug 6 2018 1:09 PM | Last Updated on Fri, Aug 10 2018 1:17 PM

84th Birthday Of Jayashankar - Sakshi

అక్కంపేటలో జయశంకర్‌ సార్‌ విగ్రహం, కేసీఆర్‌తో జయశంకర్‌ సార్‌(ఫైల్‌) 

ఆత్మకూరు (పరకాల): తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు డిసెంబర్‌ 9 ప్రకటన తర్వాత విద్యార్థులు జరుపుకున్న సంబరం మర్చిపోలేని గొప్ప జ్ఞాపకం. వారి భవిష్యత్‌ కలలతో ఆడుకున్నది ఎవరు? వారి ఆశలతో ఆడుకొని వారి శవాలపై ప్రమాణం చేసిన రాజకీయనాయకులకు వాళ్ల ఉసురు తగలకుండా పోతుందా..అని విశ్వవిద్యాలయాల విద్యార్థుల గురించి మదనపడ్డ గురువర్యులు ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌. ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష గురించి ఏమన్నారంటే.. మా వనరులు మాకున్నాయి.మా వనరులపై మాకు అధికారం కావాలి.యాచక దశ నుంచి శాసించే దశకు తెలంగాణ చేరుకోవాలి. మా తెలంగాణ మాకు కావాలి అన్నారు.

అక్కంపేటలో పుట్టిన ఆచార్యుడు...

ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ ప్రస్తుత వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో లక్ష్మికాంతరావు, మహాలక్ష్మి దంపతులకు  రెండో సంతానంగా ఆగస్టు 6,1934న జన్మించాడు. బాల్య దశ నుంచి ఉద్యమ స్వభావం కలిగిన వ్యక్తి కావడంతో వివాహం చేసుకోకుండా సొంత కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోకుండా బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు.

విద్యాభ్యాసం..

పుట్టిన గ్రామంలో రెండోతరగతి వరకు ప్రాథమిక విద్యను అభ్యసించి ఆపై చదువుకు హన్మకొండకు వెళ్లారు. అక్కడే ఉర్దూ మీడియంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఇంటర్, డిగ్రీ చదివారు. అనంతరం బెనారస్, అలీఘడ్‌ విశ్వవిద్యాలయాల నుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా పుచ్చుకుని ఉస్మానియా వర్సిటీలో పీహెచ్‌డీ  పూర్తి చేశారు.

బోధనా రంగంలో..

1975నుండి1979వరకు సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు.1979 నుంచి 1981వరకు కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా ,1982 నుంచి 1991వరకు సీఫెల్‌ రిజిస్ట్రార్‌గా 1994వరకు ఇదే యూనివర్సిటీలో వీసీగా పనిచేశారు.

ఉద్యమ ఆలోచన మొదలైందిలా..

మొట్టమొదట హైదరాబాద్‌ రాష్ట్రంలో జయశంకర్‌కు హైదరాబాద్‌లో ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చింది. అయితే సెలవులు రావడంతో ఇంకా జాయిన్‌కాలేదు. అప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అవతరించింది. అప్పుడు జయశంకర్‌ సార్‌ జాయిన్‌ కావడానికి వెళ్లగా తిరిగి రిపోర్ట్‌ చేయమని చెప్పారు. జయశంకర్‌ ఎందుకని ప్రశ్నిస్తే జీతాలు మారాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణ వారికి ఎంత అన్యాయమని జరుగుతుందని అప్పుడే సార్‌ మదిలో బీజం పడింది. ఇదే ఆయనను సిద్ధాంతకర్తగా తయారు చేసింది.

ఎమర్జెన్సీలో సాహసాలు..

సార్‌ సీకేఎం కళాశాలలో పనిచేస్తున్న సమయంలో ఎమర్జెన్సీ ప్రారంభమైంది. విప్లవ కవి వరవరరావు కూడా ఇదే కళాశాలలో పని చేసేవారు. ఆ సమయంలో సార్‌ చాకచాక్యంతో అధ్యాపకులను, విద్యార్థులను తన సామర్థ్యాలతో నిర్బంధం నుంచి కాపాడారు. విద్యార్థులను గుర్తుపెట్టుకుని పిలిచేవారు..సార్‌ పనిచేసిన మల్టీపర్పస్‌ పాఠశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకు తన దగ్గర చదువుకున్న ప్రతి విద్యార్థి పేరు గుర్తుపెట్టుకొని పిలిచేవారు. ఎంతో మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో సార్‌ వెంట నడిచారు. 

వరంగల్‌లో ఉపన్యాసం పెట్టించారు..

1952లో విశాలాంధ్రకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్న సమయంలో సార్‌ అయ్యదేవర కాళేశ్వర్‌రావు ద్వారా ఉపన్యాసం ఇప్పించారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లో అఫ్జల్‌గంజ్‌లో జరిగిన సమావేశానికి సార్‌ వెళుతుండగా భువనగిరి వద్ద బస్‌ఫెయిల్‌ కావడంతో వెళ్లలేదు. అప్పుడు కాల్పుల్లో ఏడుగురు విద్యార్థులు బలయ్యారు. తాను వెళితే అమరుల జాబితాలో ఉండేవాడినని సార్‌ పలు సమావేశాల్లో ప్రస్తావించారు. ఇడ్లీ సాంబర్‌ గో బ్యాక్, నాన్‌ముల్కీలో కీలకపాత్ర పోషించారు.  

ఎన్నో రచనలు..

జయశంకర్‌ తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్, తెలంగాణలో ఏం జరుగుతోంది, వక్రీకరణలు–వాస్తవాలు, తల్లడిల్లుతున్న తెలంగాణ, తెలంగాణ వంటి ఎన్నో పుస్తకాలు రాశారు.

నిరంతరం ఉద్యమ భావాలే..

జయశంకర్‌కు 2011జూన్‌21న తుదిశ్వాస విడిచేవరకు తెలంగాణ మీదే ధ్యాస ఉండేది. నిరంతరం ఉద్యమ భావాలను రగిలిస్తూ జీవించారు.

పాఠశాలకు స్థలం విరాళం..

సార్‌ పుట్టిన గ్రామంలో జెడ్పీహైస్కూల్‌కు గ్రౌండ్‌ కోసం వారి సొంత స్థలం 1.10 ఎకరాల భూమిని విరాళంగా అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement