
'ఇర్మా బాధితులు ఇలా చేయండి'
సాక్షి, ఫ్లోరిడా : ప్రకృతి విపత్తుల్లో, ప్రమాద సమాయాల్లో తమ వంతు సేవలు, సహాయ సహకరాలు అందించే ఆటా(అమెరికా తెలుగు అసోసియేషన్) మరోసారి నడుం కట్టింది. ఇర్మా తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో ఫ్లోరిడా, జార్జియ, అలబామా, ఇతర రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తుఫాను బారిన పడేవారికి ముందస్తు సహాయ సహకారాలు అందించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వేలమంది ఈ తుఫాను ప్రమాదంలో పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా తాము స్వచ్ఛందంగా సహాయం చేసేందుకు ముందుకొస్తామంటూ ప్రకటించింది. ఈ సందర్భంగా కొన్ని జాగ్రత్తలు సూచనలు చేసింది.
సహాయం కావాలనుకునే వారు రెండు మార్గాల్లో తమను అనుసరించవచ్చని ప్రకటించింది. ఒక ప్రత్యేక డేటాతో కూడిన ఫాం అందిస్తూ అందులో వివరాలు అందించడం ద్వారా తగిన ఏర్పాట్లు చేసే అవకాశం ఇవ్వడంతోపాటు ప్రత్యేకంగా 844-282-7382(844-ఏటీఏ-సేవా) అనే సంప్రదించాల్సిన నెంబర్ తెలిపింది. వ్యక్తిగత అవసరాలకు సరిపడిన వస్తువులు, బ్లాంకెట్/కనీస వస్త్రాలు కూడా అందజేస్తామని తెలిపింది. ఈ సందర్భంగా కొన్ని ఇండియన్ రెస్టారెంట్లు (టేస్ట్ ఆఫ్ ఇండియా, కాకతీయ ఇండియన్ రెస్టారెంట్, శ్రీ కృష్ణ విలాస్ తదితరమైనవి) ఆహారం సరఫరా చేసేందుకు ముందుకొచ్చాయని, అందుకు కృతజ్ఞతలని కూడా ప్రకటించింది. ఇప్పటికే 200 కుటుంబాలకు చేయుతనందించింది. వారికి అట్లాంటాలోని హిందూ దేవాలయాల్లో పునరావాసం కల్పించి అవసరమైన ఏర్పాట్లు చేసింది.
అత్యవసరం నేపథ్యంలో కొన్ని సూచనలు
- ముందుగా బ్యాగులల్లో ఐస్ తీసుకొని అందులో నిల్వ ఉంచాల్సిన పదార్థాలు పెట్టాలి.
- పెంపుడు జంతువులకోసం ట్యాప్ వాటర్‌ను, ఇతర తాగునీటిని ఫ్రీజ్ చేయాలి. టప్పర్ వేర్ రకానికి చెందిన బాటిల్స్ ఉపయోగించి అందులో నీళ్లు నింపుకోండి. వాటిని ఫ్రీజ్ చేసే సమయంలో కొంచెం ఖాళీగా ఉంచడం మర్చిపోవద్దు.
- వ్యర్థమై పోతాయనుకునే వస్తువులను ఈ రోజే ఉపయోగించాలి. లేదా ఫ్రీజర్‌లో నిల్వ చేసుకోవాలి.
- ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని జాగ్రత్తగా ఉంచుకోవాలి.
- అన్ని వాహనాల్లో గ్యాస్, లేదా ఇంధనం నింపుకోవాలి.
- వీలయినంత డబ్బును డ్రా చేసి దగ్గర పెట్టుకోవాలి. వేరే ప్రాంతాలకు వెళ్లేలా ఉంటే ముందుగానే బ్యాంకులకు సమాచారం ఇవ్వాలి. అలా చేయడం ద్వారా బ్యాంకులు ఖాతాలను ఫ్రీజ్ చేయకుండా ఉంటాయి.
- ఫొటోలు, ఇతర విలువైన డాక్యుమెంట్లు మెయిల్‌కు పంపించుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాల్లోగానీ, సీల్డ్ బ్యాగ్‌లోగానీ ఒరిజినల్ డాక్యుమెంట్లు భద్రపరుచుకోవాలి
- పెంపుడు జంతువులకు కావాల్సిన ఆహారపదార్ధాలు నిల్వ చేసుకోవాలి. ఆ జంతువుల వివరాలు ముందే సిద్ధం చేసి పెట్టుకోవాలి.
- వేరే ప్రాంతాలకు వెళుతుంటే ఆ సమాచారం ఇరుగుపొరుగువారికి, బంధువులకు తెలియజేయాలి. అలా చెబితే మీరు ఎక్కడ ఉన్నారనే విషయం వారికి తెలుస్తుంది.
- మీతో తీసుకు పోలేని వస్తువులుంటే వాటిని రెండు మూడో అంతస్తులోగానీ, అంతకంటే ఎత్తయిన ప్రదేశంలోగాని భద్రపరుచుకోవాలి.
- ఇంటికి సంబంధించిన కిటికీలను భద్రపరుచుకునేందుకు పాత వస్తువులు, బీచ్ టవల్స్ లాంటివి ఉపయోగించుకోవచ్చు.
- అన్ని వైపులా ఉన్న ద్వారాలను వెంటనే మూసివేయాలి. ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా పనులు ముగించుకొని బయల్దేరాలి.
- తుఫాను నుంచి బయటపడేందుకు కావాల్సిన వస్తువులు లేకుంటే ఈరోజే వాటిని తీసుకొండి.
- మీ ఆస్తికి సంబంధించిన వివరాలు తెలిపేందుకు ఒక ఫొటోనుగానీ, వీడియోనుగానీ తీసి భద్రంగా పెట్టుకోవాలి.