కెన్యా రాజధాని నైరోబిలో షాపింగ్ మాల్లో తీవ్రవాదులు నిన్న జరిపిన దాడిలో ఇద్దరు భారతీయులు మృతి చెందారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఆదివారం న్యూఢిల్లీలో వెల్లడించారు. మృతుల్లో ఒకరు శ్రీధర్ నటరాజన్ (40)గా గుర్తించినట్లు చెప్పారు. ఆయన స్థానిక ఫార్మారంగానికి చెందని కంపెనీలో పని చేస్తున్నారని పేర్కొన్నారు.
అలాగే నైరోబిలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ కుమారుడు పరాంశ్ జైన్ కూడా మరణించాడని తెలిపారు. అయితే తీవ్రవాదుల దాడిలో మరో నలుగురు భారతీయులు గాయపడ్డారని చెప్పారు. వారిలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారని తెలిపారు. వారంతా నైరోబి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. కెన్యాలోని భారతీయుల పరిస్థితిపై ఆ దేశంతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు విదేశాంగ శాఖ కార్యాలయ అధికార ప్రతినిధి వెల్లడించారు.
నైరోబిలోని షాపింగ్ మాల్లోకి నిన్న ముఖానికి మాస్క్లు ధరించిన వ్యక్తులు ప్రవేశించి, విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 39 మంది మరణించారు. 150 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఆ దాడికి తామే బాధ్యులమంటూ అల్ ఖైదాకు చెందిన అనుబంధ సంస్థ అల్ సబాబ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తీవ్రవాదుల దాడిని కెన్యా దేశాధ్యక్షుడు ఉహుర్ కెన్యెట్టా అమానవీయ చర్యగా అభివర్ణించారు. దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.