నార్త్ ఈస్ట్ ఇంగ్లాండ్‌లో ఘనంగా ఉగాది ఉత్సవాలు
న్యూ క్యాస్టిల్: తెలుగు భాషా, సంస్కృతుల విశిష్టతను ఖండాంతరాలు వ్యాపించేలా ఇంగ్లాండ్‌లోని న్యూ క్యాస్టిల్‌లో నార్త్ ఈస్ట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. సురేఖ, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకలకు లార్డ్ మేయర్ ఇయం గ్రహం ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడుతూ.. వివిధ జాతులకు చెందిన ప్రజలు నగరానికి వన్నె తెచ్చారన్నారు. అనంతరం అయనను కేవీ రావు సత్కరించారు.
జన్మ భూమికి వేల కిలో మీటర్ల దూరంలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తు తరాల వారికి అందించడమే ఈ ఉగాది వేడుకల ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు డా.మధు ఆదాల అన్నారు. ఆ తర్వాత జరిగిన సంస్కృతిక జడివాన కార్యక్రమం అక్కడికి వచ్చిన తెలుగువారందని ఆకట్టుకుంది. 'బహుబలి' చిత్రాన్ని నాటక రూపంలో చిన్నారులు ఇచ్చిన ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. పలువురు నాట్యకళాకారులు కూచుపూడి, భరత నాట్యాలతో వీక్షకులను ఆకట్టుకున్నారు.