నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యం
కోవూరు:
మండలంలో నూరుశాతం మరుగుదొడ్లు నిర్మించాలన్న లక్ష్యంగా అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని జెడ్పీ సీఈవో బి.రామిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 7 గ్రామాలకు సంబంధించి 3480 మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వీటిలో 2259 మరుగుదొడ్లు పూర్తయ్యాయన్నారు. మిగిలిన 221 మరుగుదొడ్లు చిన్నపాటి పనులతో ఆగి ఉన్నాయని తెలిపారు. మండలంలో చెర్లోపాళెం, మోడేగుంట, పాటూరు గ్రామాలను ఓడీఎఫ్ గ్రామాలుగా ప్రకటిస్తామన్నారు. గంగవరం, పోతిరెడ్డిపాళెం, కోవూరు ప్రాంతాల్లో 1150 మరుగుదొడ్లు చివరి దశలో ఉన్నాయన్నారు. అలాగే కోవూరు నియోజకవర్గ పరిధిలో 224 ఓటర్ల చేర్పులుమార్పులపై దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిని త్వరలో పరిష్కరించి తుది జాబితాలో చేర్పిస్తామన్నారు. మండలంలో వర్మికంపోస్టు కేంద్రాలను నిర్మించుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జాలిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ పీటర్ డానియల్, ఈవోపీఆర్డీ శ్రీనివాసులు, సీడీపీవో నాగమల్లేశ్వరి, ఐకేపీ ఏపీఎం సుజాత పాల్గొన్నారు.