
వైద్య శిబిరాన్ని పరిశీలిస్తున్న డాక్టర్ రాంబాబు
మల్లవరం (తల్లాడ): జిల్లాలో ఈ సీజన్‌లో 104 డెంగీ, 694 మలేరియా కేసులు నమోదైనట్టు జిల్లా మలేరియా నివారణాధికారి డాక్టర్ రాంబాబు తెలిపారు. పక్షం రోజులుగా మల్లవరం గ్రామంలో డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాలతో ప్రజలు అస్వస్థులైన విషయం పాఠకులకు విదితమే. దీంతో,ఆ గ్రామాన్ని శనివారం డీఎంఓ సందర్శించారు. తల్లాడ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ఏర్పాటైన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఎస్సీ కాలనీ, బీసీ కాలనీలను సందర్శించారు. జ్వర పీడితులను పరీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ నివారణకు వైద్య శాఖ ఆధ్వర్యంలో వారం రోజులపాటు డ్రై డే కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు. జ్వరం సోకిన వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. మురుగు గుంతల్లో దోమల మందు స్ప్రే చేశారు. కార్యక్రమంలో ఎస్‌పీహెచ్‌ఓ డాక్టర్ మాలతి, అసిస్టెంట్ మలేరియా నివారణాధికారి డాక్టర్ బన్సీలాల్, వ్యాధుల నివారణాధికారి డాక్టర్ తిరుపతి, మండల వైద్యాధికారి డాక్టర్ అర్షిదా, డాక్టర్ రత్నకుమార్ పాల్గొన్నారు.