రేపల్లె, అడవులదీవిలో 144వ సెక్షన్‌ విధింపు | 144 section at repalle divi | Sakshi
Sakshi News home page

రేపల్లె, అడవులదీవిలో 144వ సెక్షన్‌ విధింపు

Published Tue, Jul 19 2016 6:11 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

రేపల్లె, అడవులదీవిలో 144వ సెక్షన్‌ విధింపు

రేపల్లె, అడవులదీవిలో 144వ సెక్షన్‌ విధింపు

 జాస్మిన్, శ్రీసాయి మృతి ఘటనలతో 
 రేపల్లెలో వేడెక్కిన వాతావరణం
 ప్రభుత్వాస్పత్రి వద్ద శ్రీసాయి బంధువుల 
 బైఠాయింపు, ఆందోళన
 జాస్మిన్‌ సోదరుడు, బంధువును అదుపులోకి 
 తీసుకున్న పోలీసులు
 
రేపల్లె : యువతి జాస్మిన్, యువకుడు వేముల శ్రీసాయి మృతి ఘటనలు రేపల్లె పట్టణంలో ఉద్రిక్త వాతావరణానికి దారితీశాయి. నియోజకవర్గ పరిధిలోని నిజాంపట్నం మండలం అడవులదీవి పంచాయతీ మహ్మదీయపాలేనికి చెందిన షేక్‌ జాస్మిన్‌ ఆదివారం తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, ఆమె మృతికి గరువు గ్రామానికి చెందిన వేముల శ్రీసాయి, జొన్న పవన్‌కుమార్‌ కారణమని బంధువులు, గ్రామస్తులు చితకబాదడం, ఈ ఘటనలో వేముల శ్రీసాయి అస్వస్థతకు గురై మృతి చెందిన విషయం విదితమే. ఈ ఘటనలు తీవ్ర సంచలనం కలిగించాయి. వేముల శ్రీసాయిని అన్యాయంగా చంపేశారంటూ అతని కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని బైఠాయించి ఆదివారం రాత్రి నుంచి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. మరోపక్క జాస్మిన్‌ మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లేందుకు సోమవారం ఉదయం పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య  వివాదాలు చెలరేగుతాయన్న ఉద్దేశంతో జాస్మిన్‌ కుటుంబ సభ్యులను, బంధువులను ప్రభుత్వ వైద్యశాల ఆవరణలోకి పోలీసులు 
అనుమతించలేదు. ఈ సందర్భంగా పోలీసులకు, వారికి కొద్దిసేపు వాదన జరిగింది. చివరికి జాస్మిన్‌ కుటుంబ సభ్యులు సర్కిల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. రెండు ఘటనల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణంలో, అడవులదీవి గ్రామంలో 144వ సెక్షన్‌ విధించారు. ఆదివారం రాత్రి ప్రత్యేక బలగాలను మోహరింపజేశారు. అడుగడుగునా పహారా కాస్తూ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
శ్రీసాయి మృతి కేసులో ఇద్దరు అదుపులోకి...
జాస్మిన్‌ను హత్య చేశారనే అనుమానంతో  వేముల శ్రీసాయి, జొన్న పవన్‌కుమార్‌లను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనకు సంబంధించి జాస్మిన్‌ సోదరుడు షాదుల్లా, ఆమె బంధువు గౌస్‌లను పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ కేసులో గ్రామంలో మరికొంత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
హత్య కేసులుగా నమోదు
– బాపట్ల డీఎస్పీ మహేష్‌
జాస్మిన్, శ్రీసాయిల మృతి ఘటనలపై రెండు వేర్వేరు హత్య కేసులు నమోదు చేసి విచారణను వేగవంతం చేసిన ట్లు బాపట్ల డీఎస్పీ మహేష్‌ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జాస్మిన్‌ మృతిపై పలు కోణాల్లో విచారణ ప్రారంభించినట్టు తెలిపారు. జాస్మిన్‌ తాను చనిపోతున్నానని వేముల శ్రీసాయికి ఫోన్‌ చేసిన అంశం నుంచి, వారిద్దరికీ ఉన్న పరిచయం, జాస్మిన్‌కు వివాహం చేసేందుకు పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు అన్నిటిపై విచారిస్తున్నామన్నారు. జాస్మిన్‌ను శ్రీసాయి, అతని స్నేహితుడు చంపేశారా, వారు వచ్చేసరికే జాస్మిన్‌ చనిపోయి ఉందా అన్న అంశంపై పూర్తి విచారణ కొనసాగుతున్నట్టు తెలిపారు. ఆమె ఇంట్లో పడి ఉన్న బ్యాట్, బెల్టు ఎవరివన్నదానిపై కూపీ లాగుతున్నామన్నారు. జాస్మిన్‌ ఇంట్లో పడి ఉన్న రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపినట్టు తెలిపారు. జాస్మిన్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు అందించే నివేదిక కేసు విచారణకు మరికొంత ఉపకరిస్తుందన్నారు.
పోస్టుమార్టం పూర్తి
మృతిచెందిన జాస్మిన్, శ్రీసాయిల మృతదేహాలకు రేపల్లె ప్రభుత్వాస్పత్రిలో సోమవారం పోస్టుమార్టం పూర్తిచేశారు. ఇద్దరి మృతదేహాలూ ప్రభుత్వాస్పత్రిలో ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. తొలుత జాస్మిన్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, పోలీసుల బందోబస్తుతో మృతదేహాన్ని అడవులదీవి గ్రామానికి తరలించారు. అనంతరం గంటన్నర తరువాత శ్రీసాయి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి పోలీసు బందోబస్తుతో మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. శ్రీసాయి మృతదేహాన్ని గ్రామంలోకి వద్దని శ్రీసాయిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్న మహ్మదీయపాలేనికి తీసుకెళ్లి తమకు న్యాయం జరిగే వరకు అక్కడే ఉంచుతామని శ్రీసాయి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు శ్రీసాయి కుటుంబ సభ్యులు, బంధువులకు నచ్చచెప్పి శ్రీసాయి మృతదేహాన్ని గరువు గ్రామంలోని మృతుని స్వగృహానికి తరలించారు. ఈ క్రమంలో సోమవారం చీకటి పడిపోవటంతో శ్రీసాయి అంత్యక్రియలను మంగళవారం నిర్వహించే విధంగా బంధువులు నిర్ణయించుకున్నారు.
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement