కేసుల పరిష్కారమే ధ్యేయం
► నేషనల్ లోక్ అదాలత్ ప్రారంభంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి
► రాత్రి వరకు ఐదు బెంచీలతో కేసుల పరిష్కారం
లీగల్ ( కడప అర్బన్ ): జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారమే ధ్యేయంగా నేషనల్ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకనూరు శ్రీనివాస్ అన్నారు. శనివారం నేషనల్ మెగా లోక్ అదాలత్‌ను జిల్లాలోని వివిధ కోర్టుల్లో ప్రారంభించారు. జిల్లా కోర్టులో నేషనల్ మెగా లోక్ అదాలత్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకనూరు శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ మెగా లోక్ అదాలత్ చైర్మన్ దీపక్ మిశ్రా ఆదేశాల మేరకు ప్రతి రెండు నెలలకు ఒకసారి లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న నేషనల్ మెగా లోక్ అదాలత్‌లో ప్రత్యేకంగా మెజిస్ట్రేట్‌లతో కూడిన ఐదు బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. అర్ధరాత్రి వరకు పెండింగ్ కేసులను పరిష్కరించుకునేలా చర్యలు చేపట్టామన్నారు.
రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకుంటే కోర్టు ఫీజులను కూడా తిరిగి పొందవచ్చన్నారు. ప్రత్యర్థి వర్గం వారితో సమన్వయంతో కేసులను పరిష్కరించుకోగలుగుతామన్నారు. ఈ అవకాశాన్ని పోలీసులు, న్యాయవాదులు సహకరించాలని కోరారు. సమావేశానంతరం లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమైన ఓ కేసు పత్రాన్ని సంబంధిత న్యాయవాదికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసమూర్తి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ విష్ణు ప్రసాద్‌రెడ్డి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ యూయూ ప్రసాద్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జీవీ రాఘవరెడ్డి, ప్రభుత్వ న్యాయవాది గుర్రప్ప, మెజిస్ట్రేట్లు శోభారాణి, సీడబ్యూసీ చైర్మన్ శారద, భారతరత్న మహిళా మండలి వ్యవస్థాపకురాలు మూలె సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా 2274 కేసుల పరిష్కారం: నేషనల్ మెగా లోక్ అదాలత్ ఆదేశాల మేరకు శనివారం జిల్లా కోర్టులోని లోక్ అదాలత్ భవన్‌తోపాటు జిల్లాలోని వివిధ కోర్టులలో కూడా కేసుల పరిష్కారం జరిగింది. మొత్తం 2274 కేసులు పరిష్కారం అయ్యాయి. తద్వారా కక్షిదారులకు రూ.2,00,42,286ల నష్టపరిహారం లభించింది. కేసుల పరిష్కారానికి కృషి చేసిన మెజిస్ట్రేట్లు, న్యాయవాదులు, సంబంధిత అధికారులు, బాధితులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి అభినందించారు.