పుష్కరాలకు 3.50 లక్షలజనాభా | 3.5lakhs people to pushkar | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు 3.50 లక్షలజనాభా

Published Mon, Aug 15 2016 1:31 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

పుష్కరాలకు  3.50 లక్షలజనాభా

పుష్కరాలకు 3.50 లక్షలజనాభా

–మూడో రోజు జిల్లాలో కిక్కిరిసిన పుష్కర ఘాట్లు
–సాగర్‌లో 1.5లక్షలు దాటిన భక్తుల సంఖ్య
–వాడపల్లి, మట్టపల్లికీ అదే తాకిడి... మార్పు లేని బ్యాక్‌వాటర్‌ ఘాట్‌లు
–మూడోరోజు మహంకాళిగూడెంలో పోటెత్తిన భక్త జనం
– వాడపల్లిలో పుష్కర ఘాట్లను పరిశీలించిన డీజీపీ అనురాగ్‌శర్మ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరుసగా వచ్చిన సెలవుల కారణంగా జిల్లాలో పుష్కర స్నానాలు జోరందుకున్నాయి. శనివారం సెలవు ఉండడం, సోమవారం కూడా సెలవు కావడంతో ఆదివారం జిల్లా వ్యాప్తంగా భక్తుల సంఖ్య పెరిగింది. ఆదివారం ఒక్క రోజే జిల్లాలో 3.50లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారని అంచనా. నాగార్జునసాగర్‌లో అయితే భక్తుల సంఖ్య లక్షన్నర దాటింది. ఒక్క శివాలయం ఘాట్‌లోనే 1.16లక్షల మంది భక్తులు పుష్కర స్నానం చేశారని అంచనా. వాడపల్లి, మట్టపల్లికి సైతం భక్తుల తాకిడి  బాగానే కనిపించింది. వాడపల్లిలో 76 వేల మందికి పైగా, మట్టపల్లిలో 37వేల మందికిపైగా భక్తులు పుష్కర స్నానాలు చేశారు. ఇక, మిగిలిన ఘాట్లలో ఎలాంటి మార్పు లేదు. రెండో రోజు నేరేడుచర్ల మండలం మహంకాళిగూడెం ఘాట్‌కు భక్తుల సంఖ్య తగ్గినా, మూడోరోజు మాత్రం పోటెత్తారు. ఆదివారం ఒక్కరోజే అక్కడ 32వేల మందికి పైగా స్నానాలు చేశారు. ఇక, బ్యాక్‌ వాటర్‌ కింద నిర్మించిన కాచరాజుపల్లి, పెదమునిగల్, అజ్మాపూర్‌ ఘాట్‌లలో అయితే వందల సంఖ్యలోనే భక్తులు వస్తున్నారు. మూడు ఘాట్లలో కలిపి 3వేల మందికి పైగా మాత్రమే భక్తులు వచ్చారు. ఊట్లపల్లి, మేళ్లచెరువు మండలం వజినేపల్లి, కిష్టాపురం, బుగ్గమాదారం ఘాట్‌లకు కూడా భక్తులు తక్కువ గానే వెళ్లారు. కనగల్, మట్టపల్లిలోని మార్కండేయ ఘాట్‌లకు నీళ్లు మూడోరోజు కూడా స్నానాలు ప్రారంభం కాలేదు. కనగల్‌ ఘాట్‌కు ఈ రోజు నీళ్లు వస్తాయని అధికారులు చెపుతున్నారు. ఇక, దర్వేశిపురంలో అయితే 15వేల మంది భక్తులు స్నానాలు చేశారు. పానగల్‌లో 10వేల మందికి పైగా భక్తులు వచ్చారని అంచనా. దామరచర్ల మండలంలో అడవిదేవులపల్లి ఘాట్‌లో 5వేల మందికి పైగా భక్తులు స్నానాలు చేయగా, ఇర్కిగూడెం, ముదిమాణిక్యం ఘాట్‌లకు అంతగా తాకిడి లేదు. మొత్తంమీద భక్తులు పెరగడంతో అధికార యంత్రాంగంలో ఉత్సాహం కనిపిస్తోంది. పుష్కరాల తొలిరోజు కేవలం 62వేల మందికి పైగా, రెండో రోజు 1.70లక్షల మంది మాత్రమే హాజరయ్యారు. రెండోరోజు సెలవు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో భక్తులు రాకపోవడంతో పరిస్థితేంటనే మీమాంస అధికారుల్లో వచ్చింది. అయితే, మూడోరోజు సంఖ్య మూడున్నర లక్షలు దాటడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 16న రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌. నరసింహన్‌ మట్టపల్లికి రానున్నట్టు సమాచారం. అధికారికంగా సోమవారం ఖరారు కానుంది.
మూడు ప్రధాన క్షేత్రాల్లో..
సాగర్‌లో:
పర్యాటక ప్రాంతం కావడంతో సాగర్‌కు ఆదివారం భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చారు.  శివాలయం ఘాట్‌కు ఉదయం 8గంటలకే ఆరువేల మంది భక్తులు రాగా, పోలీసులు వారిని సురికి వీరాంజనేయస్వామి ఘాట్‌కు మళ్లించారు. సాయంత్రంవరకు 1.16లక్షల మంది భక్తులు కేవలం శివాలయం ఘాట్‌లోనే స్నానాలు చేశారు. సురికి వీరాంజనేయస్వామి ఘాట్‌లో 41వేల మంది భక్తులు స్నానాలు చేశారు. ఊట్లపల్లిఘాట్‌లో 2,750మంది స్నానాలు చేయగా పొట్టిచెల్మఘాట్‌లో కేవలం 70మంది మాత్రమే షవర్‌బాత్‌ చేశారు. సాగర్‌కు ఉదయం ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ  రమేశ్‌కుమార్‌ కుటుంబæసమేతంగా వచ్చి పుణ్యస్నానం చేశారు. సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి, ఆయన సతీమణి, కుమారుడు, కుమార్తెలు స్నానాలు చేశారు. సాయంత్రం కమలానందస్వామి స్నాన ం చేశారు. కలెక్టర్‌ సత్యనారాయణరెడ్డి ఘాట్లను సందర్శిచారు.
వాడపల్లిలో:
వాడపల్లి, ఆడవిదేవులపల్లిలో కూడా ఆదివారం ఉదయం నుంచి భక్తుల రాక మొదలైంది. 10 గంటల నుంచి మద్యాహ్నం రెండు గంటల వరకు భక్తులు భారీగా తరలి వచ్చారు. వాడపల్లిలోని శివాలయం ఘాట్‌కు భారీగా భక్తులు వచ్చారు. వాడపల్లిలోని శివాలయం ఘాట్‌కు ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌  నిమ్మగడ్డ  రమేశ్‌కుమార్, ఉప లోకాయుక్త గంగిరెడ్డి, ఐజీ నాగిరెడ్డి, జిల్లా జడ్జిలు సుధ, సత్యేంద్ర, రాధాకృష్ణమూర్తి, జిల్లా మొదటి అదనపు జడ్జి సునిత, లీగల్‌ లిటరసీ జడ్జి శైలజాదేవి, ఎంఎం కోర్టు జడ్జి ప్రశాంతి, మొబైల్‌కోర్డు జడ్జి రజనిలు వీఐపీ ఘాట్‌లో పుష్కర స్నానాలు చేశారు. డీజీపీ అనురాగ్‌శర్మ శివాలయం ఘాట్‌ను సందర్శించారు. అనంతరం ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించారు.
మట్టపల్లిలో:
మట్టపల్లిలో అయితే ఉదయం నుంచే భక్తుల తాకిడి పెరిగింది. పెద్ద ఎత్తున భక్తులు రావడంతో పోలీసులు ట్రాఫిక్‌ నిబంధనలను సడలించి దేవాలయ సమీపంలోని పార్కింగ్‌ స్థలం వరకు బస్సులు నడిపి ప్రయాణికులను చేరవేశారు. అదేవిధంగా కళ్యాణమండపం నుంచి నర్సింహస్వామి ఉత్సవమూర్తులను దేవాలయానికి తరలించారు. భక్తులందరికీ ప్రధాన దేవాలయంలోని మూలవిరాట్‌ను దర్శించుకునే విధంగా అవకాశం కల్పించారు. ఉపలోకాయుక్త గంగిరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు కూడా ఇక్కడ స్నానాలు చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement