
కత్తితో దాడి.. ఒకరి మృతి
చిత్తూరు (అర్బన్): చిత్తూరు పట్టణంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న గొడవ ముగ్గురు యువకుల ప్రాణాలపైకి వచ్చింది. ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి... నగరంలోని తోటపాళ్యంకు చెందిన మణి (25), నాగాలమ్మ గుడికి చెందిన తులసీ (26), ప్రకాష్ (26)లు స్నేహితులు. మణి పనిపై రాత్రి 10.30 గంటల తర్వాత సంతపేటవైపు వెళుతున్నాడు. ఇక్కడ మేస్త్రీ పనిచేసే నాగరాజు అనే వ్యక్తికి, మణికి గొడవ రావడంతో నాగరాజు మణి కడుపులో కత్తితో పొడిచాడు. విషయం తెలుసుకున్న మణి స్నేహితులు తులసీ, ప్రకాష్‌లు దీనిపై ప్రశ్నించడానికి నాగరాజు ఇంటి వద్దకు వెళ్లారు.
దీంతో వీరిపై కూడా నాగరాజు కత్తితో దాడి చేశాడు. ముగ్గురికీ కడుపు, వీపు, ఛాతీ భాగంలో కత్తిపోట్లు బలంగా ఉన్నాయని సమాచారం. వెంటనే ఆ ముగ్గుర్నీ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమించడతో వారిని వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో తులసి మృతి చెందాడు. తగాదాల వెనుక వివాహేతర సంబంధం ఉందని కొందరు, ప్రేమ వ్యవహారమని మరికొందరు చెప్పుకుంటున్నారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.