కర్నూలు(రాజ్‌విహార్): మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలోని పలు డిపోల నుంచి శైవక్షేత్రాలకు 340 ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు రీజినల్ మేనేజరు వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. గురువారం స్థానిక కొత్త బస్టాండ్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు. శుక్రవారం శివరాత్రి సందర్భంగా శ్రీశైలంతో పాటు ఇతర శైవ క్షేత్రాలకు ఈ బస్సులు నడుపుతామన్నారు. మొత్తం 340 బస్సుల్లో జిల్లా డిపోలకు చెంది 140 బస్సులు కాగా అనంతపురం, నెల్లూరు, తిరుపతి రీజియన్లకు చెందిన 200 బస్సులు తెప్పిస్తున్నట్లు తెలిపారు. బస్సులు ఘాట్‌లో నడిచేందుకు ఫిట్‌గా నిర్వాహణ పనులు చేయించామని, సెక్యూరిటీ వ్యవస్థను కూడా పటిష్టపరిచినట్లు వెల్లడించారు. ప్రయాణికుల సురక్షితాన్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రద్దీకి తగ్గట్లు శ్రీశైలం, మహనంది, కొలనుభారతి, ఓంకారం, భోగేశ్వరం, యాగంటి, రాయచూరు, సంమేశ్వరం, గురజాల, బ్రహ్మగుండంకు ఈ బస్సులు తిప్పుతామన్నారు. స్పెషల్ ఆపరేషన్స్‌లో భాగంగా ఓవరాల్‌గా ఈడీ రామారావు పర్యవేక్షిస్తారని, మెకానికల్ మొబైల్ టీం, హెల్ప్‌లైన్ సెంటర్లు, ట్రాఫిక్ సిబ్బందిని నియమించడంతోపాటు, ప్రతి డిపో వద్ద సమాచార కేంద్రాలు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.