
తవ్వింది కొంత.. చూపింది చెరువంతా!
రాష్ట్ర ప్రభుత్వం కరువు నివారణ కోసం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో ....
► పొంతన లేని ‘నీరు-చెట్టు’లెక్కలు
► పూర్తి స్థాయిలో ప్రారంభం కాని పూడికతీత పనులు
► 42 చెరువుల్లో పూర్తి అయినట్లు ప్రభుత్వ వైబ్‌సైట్‌లో వివరాలు
► తీసింది 12 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి.. చెబుతున్నది 56 లక్షలు
► గత ఏడాది కూడా సీఎంకు తప్పుడు నివేదిక
అంతా తప్పుడు నివేదికలు
రాష్ట్ర ప్రభుత్వం కరువు నివారణ కోసం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో అభాసుపాలు అవుతుంది. ఈ ఏడాది 400 చెరువుల్లో పూడికతీత పనులు చేసేందుకు 100 ఎకరాలకుపైన ఆయకట్టు ఉన్న చెరువులను నీటి వినియోగదారుల సంఘాలకు, 100 ఎకరాలలోపు ఉన్న చెరువులను జన్మభూమి కమిటీలతో పూడికతీత పనులు చేయించేందుకు రూ. 10 లక్షలలోపు అంచనాలు వేసి నామినేషన్‌పై అప్పగించారు. పనులు ప్రారంభమైన రోజు నుంచి ప్రతి రోజు సాయంత్రం ఆ రోజు తీసిన పూడిక సామర్థ్యం, ఎన్ని చెరువుల్లో తీసింది నేరుగా సీఎంకు, జిల్లా కలెక్టర్‌కు, జల వనరుల శాఖ మంత్రికి పంపిస్తున్నారు. అయితే వారు పంపుతున్న నివేదికలకు వాస్తవానికి ఎంతో తేడా ఉంది.
కర్నూలు సిటీ: జలవనరుల శాఖ ఇంజనీర్ల లెక్కలకు.. చేతలకు పొంతన లేదు. నీరు - చెట్టు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని చెరువుల్లో పూడికత పనులు చేపట్టాలి. ఇందులో భాగంగా ఈ ఏడాది 400 చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు కలెక్టర్ జిల్లాలో 323 చెరువులకు అనుమతులు ఇచ్చారు. వీటిలో 178 చెరువుల్లో పూడికతీత పనులు ప్రారంభించి 12,26,585 క్యూబిక్ మీటర్ల మట్టిని తీశారు.
అయితే ప్రభుత్వ వైబ్‌సైట్‌లో మాత్రం 282 చెరువుల్లో పనులు ప్రారంభించి ఈ నెల 6వ తేదీ నాటికి 51.89 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసినట్లు, 42 చెరువుల్లో పనులు పూర్తి చేసినట్లు గణాంకాలు చూపిస్తున్నారు. గతేడాది మే 2వ తేదీన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆ సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో తప్పుడు నివేదికలు ప్రదర్శించడంతో వివాదమైంది. ఈ ఏడాది కూడా అదే విధంగా ప్రభుత్వానికి పొంతన లేని లెక్కలు చూపడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
తేడాలు ఇటీవలే గమనించాం
నీరు-చెట్టు కార్యక్రమంలోని పూడికతీత పనుల పురోగతి నివేదికలను నేరుగా ఏఈఈలు ట్యాబ్‌ల ద్వారా పంపిస్తున్నారు. రోజువారీగా కూడా ప్రతి రోజు నివేదికలు పంపిస్తున్నాం. ఇటీవల మా నివేదకలతో వెబ్‌సైట్‌లోని లెక్కలు తేడాలు గమనించాం. అయితే గతేడాది తీసిన మట్టిని కూడా కలిపి లెక్కలు వేసినట్లు అనుమానం వస్తోంది. మరో సారి పరిశీలిస్తాం.- కె.శ్రీనివాసరావు, ఇంచార్జీ పర్యవేక్షక ఇంజనీర్ జల వనరుల శాఖ