నెల్లూరు : నెల్లూరు జిల్లాలో 47 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రులు పి.నారాయణ, శిద్దా రాఘవరావు తెలిపారు. బుధవారం మంత్రులు వరద ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే సహాయక చర్యలను పర్యవేక్షించారు. అయితే నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని కైవల్యానది, పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మనుబోలు వద్ద చెన్నై - కోల్కత్తా జాతీయ రహదారి కోతకు గురైంది. దీంతో రెండో రోజు కూడా ఈ మార్గంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా నేడు కూడా జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ జానకి సెలవు ప్రకటించారు.