8న కోరుకొండ నరసన్న కల్యాణం
అదే రోజు మధ్యాహ్నం రథోత్సవం
12 వ తేదీ వరకూ ఉత్సవాలు
అన్నవరం దేవస్థానంలో వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
అన్నవరం : అన్నవరం దేవస్థానం దత్తత ఆలయమైన కోరుకొండలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి దివ్యకల్యాణ మహోత్సవాలు మార్చి ఎనిమిది నుంచి 12వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు తెలిపారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డు హాలులో మంగళవారం స్వామివారి కల్యాణానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ఫాల్గుణ శుద్ద ఏకాదశి, మార్చి ఎనిమిదో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు స్వామివారి రథోత్సవం, అదే రోజు రాత్రి తొమ్మిది గంటలకు స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం నిర్వహిస్తారని వారు చెప్పారు. మిగిలిన నాలుగు రోజులు రోజుకొక వైదిక కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. దేవస్థానం పీఆర్‌ఓ తులా రాము, వ్రతపురోహిత సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఛామర్తి వెంకటరెడ్డి పంతులు (కన్నబాబు), కార్యదర్శి బండి నర్శింహమూర్తి, వ్రతపురోహితులు ఆకొండి వ్యాస్, కర్రి వైకుంఠం తదితరులు పాల్గొన్నారు.