
హోంగార్డు చెంప చెళ్లు మనిపించిన యువతి
కేసు నమోదు చేసిన కీసర పోలీసులు
కీసర : ద్విచక్రవాహనంపై రాంగ్‌రూట్‌లో వెళ్తున్న ఓ యువతి.. తనను ఫొటో తీసినందుకు ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హాంగార్డు చెంప చెల్లుమనిపించింది. రంగారెడ్డి జిల్లా కీసర ఠాణా పరిధిలో ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ గురువారెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని దమ్మాయిగూడకు చెందిన అర్చిత ఇంజినీరింగ్ చదువుతోంది. మంగళవారం సాయంత్రం ఆమె తన ద్విచక్రవాహనంపై నాగారం గ్రామం మీదుగా స్వగ్రామానికి వెళ్లేందుకు రాంగ్‌రూట్‌లో వెళ్తోంది.
దమ్మాయిగూడ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న మల్కాజిగిరి ట్రాఫిక్ ఠాణాకు చెందిన హోంగార్డు వెంకటేష్ ఈ విషయం గమనించి తన వద్ద ఉన్న కెమెరాలో యువతి వాహనాన్ని ఫొటో తీశాడు. ఇది గమనించిన అర్చిత హోంగార్డుతో వాగ్వాదానికి దిగింది. తన ఫొటో ఎందుకు తీశావని ఆమె ప్రశ్నించగా.. రాంగ్‌రూట్‌లో వెళ్లినందుకు జరిమానా విధించేందుకు ఫొటో తీశానని వెంకటేష్ బదులిచ్చాడు. కెమెరా నుంచి ఫొటో తొలగించాలని ఆమె డిమాండ్ చేసింది. ఈక్రమంలో అతడితో గొడవకు దిగింది. హోంగార్డు కాలర్ పట్టుకొని చెంప చెల్లుమనిపించింది. అక్కడే ఉన్న కొందరి సమాచారంతో కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువతిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.