రవాణాశాఖలో త్వరలో సమూల మార్పులు తీసుకువస్తున్నట్లు డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సుందర్‌వద్ది తెలిపారు.
♦ రవాణాశాఖలో సమూల మార్పులు
♦ ఈనెల 15 నుంచి అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే
♦ రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ సుందర్‌వద్ది
అనంతపురం సెంట్రల్ : రవాణాశాఖలో త్వరలో సమూల మార్పులు తీసుకువస్తున్నట్లు డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సుందర్‌వద్ది తెలిపారు. ఈనెల 15 నుంచి అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే పొందే వెసులుబాటును కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడారు. రవాణాశాఖలో నూతన సాఫ్ట్‌వేర్ వస్తోందనీ, డ్రైవింగ్ లైసెన్స్, ఎల్‌ఎల్‌ఆర్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ తదితర అన్ని సేవలను ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అధికారులు కూడా కంప్యూటర్ ద్వారానే సర్టిఫికెట్లు మంజూరు చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే అన్ని సేవలకు ఆధార్‌కార్డు ఉంటే చాలనీ, భవిష్యత్‌లో రకరకాల సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
దీనివల్ల ప్రజలు ఇంటి వద్ద నుంచే అన్ని కార్డులు పొందవచ్చన్నారు. ఒక్కసారి మాత్రమే కార్యాలయానికి రావాల్సి ఉంటుందని తెలిపారు. ఆన్‌లైన్ విధానంపై త్వరలో డీలర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణపై కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి వాహనానికి జీపీఎస్ తప్పనిసరిగా అమర్చుకోవాలనీ, పరిమితికి మించి వేగంగా వెళ్తే జరిమానా విధించేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ప్రతి 50 కిలో మీటర్లుకు ఒక ట్రామాకేర్ హాస్పిటల్‌ను జాతీయ రహదారిలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ. దీని వల్ల క్షతగాత్రులకు వెంటనే వైద్యం అందుతుందన్నారు.