ఇక ఎరువులకూ ఆధార్
– వెబ్‌ల్యాండ్‌లో నమోదు తప్పనిసరి
తనకల్లు (కదిరి) : విచ్చలవిడిగా ఎరువుల వాడకాన్ని నియంత్రించడం, ఎరువుల తయారీ కంపెనీల అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఎరువుల కొనుగోలుకు ‘ఆధార్’ కీలకం కానుంది. కదిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 40 దాకా ఎరువుల దుకాణాలున్నాయి.
వెబ్‌ల్యాండ్ ఆధారంగా..
ప్రతి ఎరువుల దుకాణంలో ఈ పాస్ మిషన్ ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందుకు రైతుల వివరాలు, భూముల సర్వే నంబర్లు వెబ్‌ల్యాండ్‌లో ఉంచేందుకు కసరత్తు చేస్తున్నారు. వాటికి ఆధార్ అనుసంధానం చేయడమే కాక, యంత్రాలలో ఆధార్ నంబర్ నమోదు చేయనున్నారు. దీంతో ఎరువుల కొనుగోలు సమయంలో రైతుల వేలి ముద్రలు వేయగానే వారి భూముల వివరాలు కూడా స్పష్టంగా తెలుసుకొనే వీలుంటుందని, తద్వారా ఎరువుల విక్రయాల అక్రమాలను అరికట్టవచ్చని వ్యవసాయాధికారులంటున్నారు. అందులో భాగంగా ఇటీవల అన్ని మండలాల్లో వ్యవసాయ సిబ్బంది డీలర్లతో సమావేశం నిర్వహించి శిక్షణ సైతం ఇచ్చారు.
రైతుల్లో భిన్నభిప్రాయాలు
సబ్సిడీ లేకుండా ఎరువుల కొనుగోలు చేసిన తరువాత బ్యాంకు ఖాతాకు సబ్సిడీ మొత్తాన్ని బదిలీ చేస్తామని అధికారులంటున్నారు. అయితే ఈ విధానంపై రైతుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని కొందరు రైతులంటుండగా, మరికొందరు నగదు పెట్టి ఎరువులు కొనుగోలు చేసిన తరువాత బ్యాంకుల్లో సబ్సిడీని జమ చేస్తామని చెప్పడం సమంజసం కాదంటున్నారు.
పేరు తప్పనిసరి
విస్తీర్ణంలో ఉన్న భూమికే ఎరువులు, విత్తనాలను అందజేసే అవకాశం ఉండడంతో రైతులు తప్పనిసరిగా వెబ్‌ల్యాండ్‌లో పేర్లు ఉండేలా చూసుకోవాలి. పేర్లు నమోదు చేసుకోని రైతులు వీఆర్వోలను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఉపయోగపడితే మంచిదే
ఎరువుల కొనుగోలుకు సైతం ఈ పాస్ మిషన్లను వినియోగిస్తే మంచిదే. ఆధార్ లింక్ పేరుతో సబ్సిడీని బ్యాంక్ ఖాతాలో జమ చేయకుండా వేధించకూడదు. రైతులకు మేలు జరిగితే మంచిదే.
- రెడ్డెప్ప, రైతు, గందోడివారిపల్లి
త్వరలోనే అమలు చేస్తాం
ఎరువుల దుకాణాల యజమానులకు ఈ పాస్ యంత్రాలు త్వరలోనే ఇస్తాం. ఇకపై ఎరువుల విక్రయాలు వాటి ద్వారానే నిర్వహించాల్సి ఉంటుంది. ఈ విధానం రైతులకు ప్రయోజనకారిగా ఉంటుంది.
జ్యోత్స్న, ఏఓ, తనకల్లు