ఏపీలో హోరెత్తిన అంగన్వాడీల ఆందోళనలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా అన్ని జిల్లాల్లో శుక్రవారం అంగన్వాడీ వర్కర్ల ఆందోళనలు పెల్లుబికాయి. కొత్తగా పెంచిన జీతాల జీవో వెంటనే అమలు చేయాలని... పాత బకాయి వేతనాలను విడుదల చేయాలని కోరుతూ భారీ ర్యాలీలు నిర్వహించారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని అంగన్వాడీ వర్కర్లు హెచ్చరించారు.
శ్రీకాకుళం జిల్లా: తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్‌వాడీ వర్కర్లు టెక్కిలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కొత్తగా పెంచిన జీతాల జీవో వెంటనే అమలు చేయడంతో పాటు... పాత బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
విజయనగరం జిల్లా : పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని అంగన్‌వాడీ వర్కర్లు ముట్టడించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో వందల సంఖ్యలో అంగన్‌వాడీ వర్కర్లు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. పెంచిన వేతనాలకు సంబంధించి జీవోను వెంటనే విడుదల చేయాలని, పదవీ విరమణ, పింఛను సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
కృష్ణాజిల్లా: తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్‌వాడీ వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ దగ్గర ఆందోళనకు దిగారు. ఐసీడీఎస్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని, కొత్తగా పెంచిన జీతాల జీవో వెంటనే అమలు చేయాలన్నారు.
వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగు మండలకేంద్రంలో అంగన్ వాడీ వర్కర్లు భారీ ర్యాలీ తీశారు. ఎండీఓ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కె.వినాయక్కు వినతి పత్రం సమర్పించారు.
అనంతపురం జిల్లా: కదిరి ఆర్డీఓ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ వర్కర్లు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కారించాలని లేనిచో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కదిరి ఆర్డీఓ రాజశేఖర్‌కు అంగన్‌వాడీ వర్కర్లు వినతి పత్రం సమర్పించారు.