సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, సమ్మె విరమించి బాలింతలు, తల్లులు, పిల్లలకు సేవలందించాలని ప్రభుత్వ బృందం విజ్ఞప్తి చేసింది. అంగన్‌వాడీల సంఘాల నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కేఎస్ జవహర్‌రెడ్డితో కూడిన అధికారుల బృందం మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మరోమారు చర్చించింది. ఈ చర్చల్లో మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. అంగన్‌వాడీల సమ్మె కారణంగా బాలింతలు, తల్లులు ఇబ్బంది పడుతున్నారని, అర్థం చేసుకుని సమ్మె విరమించి సహకరించాలని అన్నారు.
జనవరి 5 నుండి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణిలు, బాలింతలు, చిన్నారులకు టేక్ హోం రేషన్ కిట్లు, ఇతర సరుకులు పంపిణీ చేయాల్సి ఉన్నందున సంక్రాంతి వరకూ సమ్మెను వాయిదా వేయాలని విజ్ణప్తి చేశారు. సంక్రాంతి తర్వాత మరలా కూర్చుని చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకుందామని కోరారు. అంగన్‌వాడీల 11 డిమాండ్లలో ఒక్కటి తప్ప 10 డిమాండ్లు ప్రభుత్వం ఆమోదించిందని వివరించారు. వాటిని అమలు చేస్తూ జీవోలు కూడా జారీ చేశారని గుర్తు చేశారు.
పదవీ విరమణ వయస్సు 60 నుండి 62 ఏళ్ళకు, పదోన్నతి వయస్సు 45 నుండి 50 ఏళ్ళకు పెంపు, టీఏ, డీఏలు, అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇచ్చే సేవా ప్రయోజనం రూ.50 వేల నుంచి రూ. లక్షకు పెంపు, సహాయకులకు ఇచ్చే సేవా ప్రయోజనాన్ని రూ.20 వేల నుండి రూ.40 వేలకు పెంచడం వంటి వాటికి సంబంధించిన జీవోలు ప్రభుత్వం ఇచ్చిందని వివరించారు. మిగిలిన వాటిపై కూడా రెండు, మూడు రోజుల్లో జీవోలు జారీ చేస్తుందని తెలిపారు. గౌరవ వేతనం పెంపు అంశం ఒక్కటే మిగిలి ఉందని, దీనిపై సంక్రాంతి తర్వాత చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకుందాని చెప్పారు.
తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని, వేతనాల పెంపునకు కొంత సమయం కావాలని అడిగారు. అంగన్‌వాడీల గ్రాట్యుటీ అంశం తమ పరిధిలో లేదని, దీనికి సంబంధించి కేంద్రానికి లేఖ రాస్తామని చెప్పారు. తాము బెదిరించడం లేదని, సమ్మె విరమించాలని కోరుతున్నామని మంత్రి బొత్స వివరించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్) చిరంజీవి చౌదరి, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, డైరెక్టర్ విజయ కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.
కాగా, వేతనాలు పెంచకపోతే ఆందోళన విరమించేది లేదని అంగన్‌వాడీ యూనియన్ నేతలు ప్రకటించారు. చర్చల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సుబ్బరావమ్మ, రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి, ఉపాధ్యక్షురాలు సుప్రజ, అంగన్‌వాడీ హెల్పర్ల సంఘం ఉపాధ్యక్షురాలు రమాదేవి, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షురాలు గంగావతి, ఉపాధ్యక్షురాలు జి.భారతి, కార్యదర్శి వీఆర్.జ్యోతి, ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.ప్రేమ, ఉపాధ్యక్షురాలు ఫ్లారెన్స్, ప్రధాన కార్యదర్శి జె.లలిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment