సాక్షి అమరావతి: అంగన్‌వాడీల సమ్మెపై చంద్రబాబు, లోకేశ్ నీచ రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సమ్మె విరమించాలని అంగన్‌వాడీలకు విజ్ఞప్తి చేశామన్నారు. వారు అత్యవసర సర్విసుల కిందకు వస్తారని, అందుకే ఎస్మా తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
బాలింతలు, గర్భిణిలకు సేవల్లో ఇబ్బంది రాకూడదనే ఎస్మా తీసుకొచ్చామని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘గర్భిణిలు, బాలింతలు, పిల్లలకు ఆహారం ఇవ్వడం అత్యవసర సేవ కాదా? అందుకే అలా చేశాం. వారి డిమాండ్లలో 90 శాతం నెరవేర్చాం. ఒకటి రెండు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికల ముందు చెప్పింది అధికారంలోకి రాగానే అమలు చేశాం.
ఇప్పుడు ఎన్నికల తర్వాత మిగతా డిమాండ్లు కూడా కచ్చితంగా అమలుచేస్తామనే చెప్పాం. ఇప్పుడే కావాలని వారు అంటున్నారు. ఆ బరువు ఇప్పుడు ప్రభుత్వం మోయలేదు. ముందు సమ్మె విరమించండి అని రిక్వెస్ట్ చేశాం. ఇంతకంటే పొలైట్‌గా గతంలో ఏ ప్రభుత్వం అయినా ఉందా?. చంద్రబాబు ఏనాడైనా ఇంత సంయమనంతో ఉన్నాడా? తుపాకులతో కాల్పులు జరిపింది ఎవరు.
గుర్రాలతో తొక్కించింది ఎవరు అంటే చంద్రబాబే కనిపిస్తారు. చంద్రబాబు నైజాన్ని పుణికి పుచ్చుకున్న లోకేశ్ మా గురించి సీఎం జగన్ గురించి విమర్శలు చేయడం విడ్డూరం. ఇక అంబటి రాయుడు కొద్దిరోజుల క్రితమే పార్టీలో చేరారు. ఆయన ఏ రీజన్‌తో వచ్చారో, దేనికి రాజీనామా చేశారో అనేది తెలియదు. కొద్దికాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని ట్వీట్‌లో తెలిపారు. పూర్తి వివరాలు తెలిశాక స్పందిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment