సాక్షి, విజయవాడ: ప్రభుత్వం మూడు దఫాలుగా అంగన్‌వాడీలతో చర్చించిందని.. సమస్యలు పరిష్కరించే ఉద్దేశం ఉంది కాబట్టే చర్చలు జరిపామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం మూడో దఫాలో మంత్రి వర్గంతో అంగన్వాడీ కార్మికులు, సంఘాలు చర్చలు జరిపాయి. చర్చల అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు.
‘‘వారి డిమాండ్లలో కొన్నింటిని నెరవేరుస్తామని చెప్పాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే జీతాలు పెంచాం. వచ్చే జూలైలో జీతాలు పెంచుతామని చెప్పాం. అంగన్‌వాడీల టీఏ, డీఏలు కూడా ఫిక్స్ చేస్తున్నాం. ప్రభుత్వం వైపు నుంచి సానుకూలంగా వ్యవహరించాం. వారి సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది’’ అని సజ్జల అన్నారు.
సమ్మె చేస్తున్న అంగన్‌వాడీల పట్ల ఎప్పుడూ పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదని, గర్భిణీలు, పసిబిడ్డలకు ఇబ్బంది కలగకూడదనే ఎస్మాన పరిధిలోకి తెచ్చామని సజ్జల స్పష్టం చేశారు. ఈ సమ్మె కాలంలో.. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశాం. అంగన్‌వాడీలు విధుల్లో చేరాలని ప్రభుత్వం తరఫున కోరారాయన.
ఈ సమ్మె వెనుక పొలిటికల్ ఎజెండా ఉంది. ఈ పోలిటికల్ ఎజెండాతో అంగన్వాడీలు నష్టపోతారు. వారు విధుల్లో చేరకుంటే నిబంధనలు ప్రకారం కొత్తవారిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది అని సజ్జల పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment