పెనుగొండలో ఏసీబీ దాడులు | ACB raid in penugonda | Sakshi
Sakshi News home page

పెనుగొండలో ఏసీబీ దాడులు

Published Tue, Aug 9 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

ACB raid in penugonda

పెనుగొండ :  పెనుగొండ పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కె.రాజేంద్ర కథనం ప్రకారం.. పెనుగొండ ఇందిరా శాంతినగర్‌కు చెందిన గెద్దాడ రూతమ్మ ఇంటి ప్లాను అనుమతి కోసం 2015లో  దరఖాస్తు చేసుకున్నారు.  అదే ఏడాది అక్టోబరు 12న జరిగిన పంచాయతీ సమావేశంలో దీనికి ఆమోదం లభించింది. అయితే, అప్పటి నుంచి రూతమ్మ పలుమార్లు పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్లాను అనుమతి పత్రాలు అందజేయలేదు. దీంతో రూతమ్మ తమ్ముడైన  మెరిపే వెంకటేశ్వర్లు ప్లాను విషయమై పంచాయతీ అధికారులతో సంప్రదింపులు జరపగా.. పత్రాలు కనపడడం లేదని సిబ్బంది చెప్పారు. రూ.5వేలు లంచం ఇస్తే తిరిగి ప్లాన్‌ పత్రాలు బ్లూప్రింట్‌ తీసి అప్రూవల్‌ చేసి ఇస్తామని పేర్కొన్నారు. దీంతో వెంకటేశ్వర్లు ఆదివారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనల ప్రకారం.. సోమవారం ఆయన రూ.5వేలు పంచాయతీలో విధులు నిర్వర్తిస్తున్న విశ్రాంత ఈవో సత్యనారాయణకు అందజేయగా.. ఆ నగదును రికార్డు అసిస్టెంట్‌ ఎల్‌.రామారావుకు అందజేశారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు రంగ ప్రవేశం చేసి వారిద్దరినీ అదుపులోకి తీసుకుని రసాయన పరీక్షలు నిర్వహించారు. లంచం తీసుకున్నట్టు ధ్రువీకరించారు. దీనిపై వారిద్దరినీ  విచారించగా గ్రామ కార్యదర్శి పి వసంతరావు సూచన మేరకే ఆ డబ్బు తీసుకున్నట్టు వారు వివరించారు. అలాగే ఆగస్టులో పంచాయతీకి జమైన నిధులు రూ.1,00,755 ఉండాల్సి ఉండగా..    రూ.3,800 మాత్రమే ఉండడంతో కార్యదర్శిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అత్యవసర పనుల నిమిత్తం ఖర్చుచేసినట్టు ఆయన వివరించడంతో అలా ఖర్చుచేసే అధికారం లేదని ఏసీబీ అధికారులు తేల్చిచెప్పారు. కేసు నమోదు చేసి  కార్యదర్శి పి.వసంతరావు, రికార్డు అసిస్టెంట్‌ ఎల్‌.రామారావు, రిటైర్డు ఈవో సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో ఏసీబీ సీఐ యు.జె.విల్సన్, వై.రాఘవేంద్రరావు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement