పుట్టినరోజే మృత్యు ఒడికి..
పుట్టినరోజే మృత్యు ఒడికి..
Published Sun, Jul 31 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
మచిలీపట్నం(కోనేరుసెంటర్) :
ఆ ఐదుగురూ స్నేహితులు. తమలో ఒకరి పుట్టిన రోజు నేపథ్యంలో విహార యాత్ర కోసం మచిలీపట్నం మండలంలోని మంగినపూడి బీచ్‌కు వచ్చారు. సముద్ర తీరానికి చేరుకున్న వారు అలల ఉధృతిని చూసి కేరింతలు కొట్టారు. ముగ్గురు ఒడ్డున నిలబడగా, ఇద్దరు ఉత్సాహంగా అలలకు ఎదురెళ్లారు. ఇంతలో రాకాసి అల వారిపై విరుచుకుపడింది. క్షణకాలంలో జరిగిన ఘోరాన్ని చూసిన తోటి పర్యాటకులు సముద్రంలోకి పరుగులు పెట్టి అతికష్టం మీద ఇద్దరినీ బయటకు తీసుకొచ్చారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ఆ ఇద్దరూ వృుత్యుఒడికి చేరుకున్నారు. ఈ విషాద ఘటన ఆదివారం జరిగింది. బందరు రూరల్ పోలీసుల కథనం మేరకు.. ఇబ్రహీంపట్నం మండలం, కొండపల్లి పాత బి.కాలనీకి చెందిన టేకుపల్లి అక్షిత (19), అమర్లపూడి ప్రవీణ్‌జై (20), పొన్నం ఆదర్ష్, నల్లమోతు వినయ్‌ప్రమోద్, యడ్ల స్వాతి స్నేహితులు. అక్షిత విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో చదువుతోంది. ప్రవీణ్‌జై గన్నవరం పాలిటెక్నిక్ కళాశాలలో చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. మిగిలిన ముగ్గురు వేర్వేరు ప్రయివేటు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆదివారం అక్షిత పుట్టినరోజు కావటంతో ఐదుగురు కలిసి గుడ్లవల్లేరు మండలంలోని కొండాలమ్మతల్లి గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మంగినపూడి బీచ్‌కు చేరుకున్నారు. అక్షిత, ప్రవీణ్‌జై ముందుగా సముద్రంలోకి వెళ్లి అలలతో సందడిచేస్తుండగా, మిగిలిన ముగ్గురు సముద్రం ఒడ్డున భోజనానికి ఉపక్రమించారు. ఇంతలో ఒక్కసారిగా పెద్ద అల విరుచుకుపడింది. ఆ అల తాకిడికి ప్రవీణ్‌జై నీటిలో మునిగిపోగా అతడిని రక్షించేందుకు అక్షిత ముందుకెళ్లింది. అయితే అలతాకిడి ఉధృతంగా ఉండటంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన స్థానిక ఫొటోగ్రాఫర్లు హుటాహుటిన సముద్రంలోనికి పరుగు పెట్టి అతికష్టంపై ఇద్దరినీ ఒడ్డుకు చేర్చారు. ప్రవీణ్‌ను బైక్‌పై, అక్షితను ఆటోలో బందరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా కొన ఊపిరితో ఉన్న ఇద్దరూ మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు.
తల్లడిల్లిన స్నేహితులు
విహారయాత్రకు వచ్చిన స్నేహితులు కళ్లముందే ప్రాణాలు విడవడంతో ఆదర్ష్, వినయ్, స్వాతి తల్లడిల్లారు. ఆస్పత్రి ఆవరణలో విగతజీవులుగా పడివున్న అక్షిత, ప్రవీణ్‌జై మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
జరిగిన ఘొరాన్ని మృతుల బంధువులు, స్నేహితులకు ఫోన్‌లో చెబుతూ తల్లడిల్లిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. బాధి కుటుంబాల నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదుచేసి పోలీసులు తెలిపారు.
Advertisement