ఎన్నాళ్లిలా!
ఎన్నాళ్లిలా!
Published Fri, Mar 10 2017 10:30 PM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM
వీడని చిక్కుముడిలా తుందుర్రు ఆక్వా పార్క్ సమస్య
ఆందోళనకారులుఽ, ఫ్యాక్టరీ యాజమాన్యం మధ్య సమస్యగా పేర్కొంటూ గుడ్లప్పగించి చూస్తున్న ప్రజాప్రతినిధులు
తెరవెనుక నుంచి యాజమాన్యానికి సహకారం
పోలీసులను ఉసిగొల్పి చిన్నారులు, వృద్ధులను సైతం నడిరోడ్డుపై ఈడ్చేస్తున్న పోలీసులు
మూడేళ్లుగా ఉద్యమం నడుస్తున్నా పరిష్కారం దిశగా చర్యలు చేపట్టని సర్కారు
ప్రభుత్వ కర్కశ చర్యలను తాళలేక.. ఎప్పుడూ ఇల్లు దాటి ఎరుగని
సామాన్య మహిళలు సైతం ఉద్యమ పంథాలోకి
భీమవరం :
జనావాసాలను ఆనుకుని తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల మధ్య పచ్చటి పంట పొలాల్లో విషం చిమ్మే గోదావరి మెగా ఆక్వా పార్క్ నిర్మిస్తుండటాన్ని మూడేళ్లుగా అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అధికారమే అండగా చెలరేగిపోతూ.. పోలీసులను ఉసిగొల్పి దమనకాండకు పాల్పడుతూ.. పుండుమీద కారం చల్లినట్టుగా ప్రజల మనోభావాలను సాక్షాత్తు ప్రభుత్వమే దెబ్బతీస్తోంది. ’ఇందేం దారుణమయ్యా’ అని అడిగిన వాళ్లపై అరాచకానికి తెగబడుతోంది. ఇంటింటికీ పోలీసుల్ని పంపించి భీతావహ వాతావరణం సృష్టిస్తోంది. మగవాళ్లను ఊళ్లో ఉండనివ్వకుండా తరిమేస్తోంది. ఇంటి తలుపులు తీసుకుని బయటకొచ్చే మహిళల్ని, చిన్నారులను సైతం పోలీస్ జీపుల్లో కుక్కి ఠాణాలకు తీసుకెళ్లి బండబూతులు తిట్టిస్తోంది. తమ కష్టాలను చెప్పుకుందామని వెళితే.. ప్రజాప్రతినిధులు మొహం చాటేస్తున్నారు. అధికారులకు గోడు వెళ్లబోసుకుందామంటే మాట వినడం లేదు. ప్రభుత్వానికి విజ్ఞాపనలు పంపిస్తే ఎదురు దాడికి దిగుతోంది. ఇలాంటి పరిస్థితుల నడుమ అక్కడి సామాన్య జనం విసిగిపోయారు. పోరాటమే శరణ్యమంటూ ఉద్యమబాట పడుతున్నారు. ఏడాదిన్నర క్రితం సాదాసీదాగా మొదలైన ఆక్వా పార్క్ వ్యతిరేక ఉద్యమం ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండ కారణంగా ఉధృతరూపం దాల్చింది. ఇది చివరకు సమరశీల (మిలిటెంట్) పోరాటానికి దారి తీస్తుందేమో అనే ఆందోళన కలిగిస్తోంది. ఉద్యమం చల్లారాలంటే ప్రజలకు నచ్చచెప్పి.. వారిని ఒప్పించి నిర్మాణ పనులకు మార్గం సుగమం చేయాలి. కానిపక్షంలో అక్కడి సామాన్యులు సైతం కోరుతున్నట్టు ఆక్వా పార్క్‌ను జనావాసాలు లేని సముద్ర తీరానికి తరలించడం తప్ప మరో మార్గం లేదు. ఈ రెండు విషయాలను ఇటు ప్రజాప్రతినిధులు, అటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కీలకంగా వ్యవహరించాల్సిన రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోకపోవడం, ప్రజాభీష్టాన్ని శాంతిభద్రతల సమస్యగా చూపిస్తూ పోలీస్ యంత్రాంగం భీతావహ వాతావరణం సృష్టిస్తోంది. మొత్తంగా చూస్తే సమస్యను పరిష్కరించడం మానేసి పరోక్షంగా ప్రభుత్వమే ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళుతోంది.
ప్లేటు ఫిరాయించిన ప్రజాప్రతినిధులు
ఆక్వా పార్క్ నిర్మాణం వల్ల తుందుర్రు సమీపంలోని 40 గ్రామాలు కాలుష్యం బారినపడతాయని.. పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతుందని.. పంట పొలాలు నాశనమవుతాయని సుమారు మూడేళ్లుగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సుమారు ఏడాది క్రితం వరకూ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇచ్చిన నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అనంతరం ప్లేటు ఫిరాయించారు. ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఎటువంటి నష్టం కలగదంటూ యాజమాన్యానికి వంత పాడారు. ఇదిలావుంటే.. నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)నోరు విప్పటం లేదు. ఈ నేపథ్యంలో సమస్యను బాధిత గ్రామాల ప్రజలు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన రాజ్యసభ సభ్యురాలు సీతారామలక్ష్మి నివాసం బాధితులతో సమావేశమై వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది ప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకువెళతానని, సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన పితాని సత్యనారాయణ ఆనక మొహం చాటేశారు. ఇలాంటి పరిస్థితుల నడుమ భీమవరం, నరసాపురం ఎమ్మెల్యేలు అంజిబాబు, మాధవనాయుడులను జన్మభూమి గ్రామసభలకు సైతం రానివ్వకుండా ప్రజలు అడ్డుకున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధుల్లో ఎటువంటి స్పందన కానరావడం లేదు.
అధికారుల వైఫల్యం
సమస్యను పరిష్కరించే విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అధికారులు సైతం ఈ అంశాన్ని గాలికొదిలేశారు. ఆక్వా పార్క్ వల్ల ఎలాంటి సమస్యలు రావని చెబుతున్న అధికారులు ఆ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారు. బాధిత గ్రామాల్లోకి వెళ్లకుండా భీమవరంలో మొక్కుబడి సమావేశాలు నిర్వహించడం విమర్శలకు తావిచ్చింది. ఫ్యాక్టరీ నుంచి ఎటువంటి వ్యర్థ జలాలు బయటకు రావని, ఆ నీటిని వినియోగించడానికి ఎక్కువ విస్తీర్ణంలో యాజమాన్యం మొక్కలు పెంచుతుందని చెప్పిన ప్రభుత్వం ఆ తరువాత కలుషిత జలాలను సముద్రంలో కలిపే విధంగా ప్రజాధనంతో పైప్‌లైన్ నిర్మిస్తామని ప్రకటించడంతో ప్రజల్లో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదని ప్రభుత్వం, యాజమాన్యం చెప్పినదంతా బూటకమేనని నిర్థారణకు వచ్చిన ప్రజలు ఎట్టి పరిస్థితిల్లో నిర్మాణాన్ని అడ్డుకుతీరతామని భీష్మీంచారు. తమపై కేసులు బనాయించి జైళ్లపాలు చేసినా వెనక్కి మళ్లేది లేదని.. ప్రజలపై ఉక్కుపాదం మోపి ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తిచేసినా తరువాత దాని ఉనికికే ప్రమాదమని బాధిత గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు.
Advertisement
Advertisement