టార్గెట్‌ 2019 | Activity aimed at general election | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ 2019

Published Fri, Mar 17 2017 1:17 AM | Last Updated on Fri, Mar 22 2019 6:24 PM

టార్గెట్‌ 2019 - Sakshi

టార్గెట్‌ 2019

టీఆర్‌ఎస్‌లో సంస్థాగత సందడి
సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ
త్వరలోనే కొత్త జిల్లాలకు అధ్యక్షులు
ఉమ్మడి జిల్లా యూనిట్‌గా సభ్యత్వం
2015లో కంటే భారీగా నమోదు చేయాలని లక్ష్యం
19న ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం


వరంగల్‌:  తెలంగాణ రాష్ట్ర సమితి.. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తోంది. ఈ మేరకు రెండేళ్లకోసారి నిర్వహించే  సంస్థాగత ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. పార్టీ సభ్యత్వ నమోదు 2015లో కంటే ఈసారి ఎక్కువగా చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకత్వం ఈ ప్రక్రియను గురువారం మొదలు పెట్టింది. పాత జిల్లాలను యూనిట్‌గా తీసుకుని సభ్యత్వ నమోదు నిర్వహిస్తోంది. కాగా, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈనెల 19న వరంగల్‌ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదును ప్రారంభించనున్నారు.

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సభ్యత్వ నమోదు ప్రక్రియలో వేగం పెంచాలని పార్టీ ఎమ్మెల్యేలకు టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక ప్రణాళికతో సభ్యత్వ నమోదును పూర్తి చేసే బాధ్యత ఎమ్మెల్యేలకు, ఇంచార్జీలకు అప్పగించారు. సభ్యత్వ నమోదుతో పాటే పార్టీ గ్రామ, మండల, జిల్లా కమిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.

రెండేళ్లలో తేడా...
ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు ప్రతి రాజకీయ పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను నిర్వహించాల్సి ఉంటుంది. టీఆర్‌ఎస్‌లో రెండేళ్లకోసారి ఈ ప్రక్రియ జరుగుతుంది. 2015లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ జరిగింది. అప్పుడు ఉమ్మడి జిల్లా యూనిట్‌గా ఉండేది. వరంగల్‌ జిల్లాలో 5,42,194 మంది సభ్యత్వాలు స్వీకరించారు. ఇప్పుడు కూడా పాత జిల్లాలు యూనిట్‌గానే సభ్యత్వ నమోదు నిర్వహించనున్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 2014 ఎన్నికల్లో పార్టీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. 2014 చివరల్లో డోర్నకల్, పరకాల ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు. 2015 సభ్యత్వ నమోదు సమయంలో పది అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ వారే ఉండేవారు. ఆ తర్వాత 2016లో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో 2015లో కంటే సభ్యత్వ నమోదును పెంచాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఎమ్మెల్యేలను ఆదేశించింది.

రుసుము భారం ఎమ్మెల్యేలపైనేనా...
2015లో నిర్వహించిన సభ్యత్వ నమోదులో కార్యకర్తలు, నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మంది సభ్యత్వం స్వీకరించారు. ఈసారి కొంత వింత పరిస్థితి కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో నామినేటెడ్‌ పదవులను పూర్తిగా భర్తీ చేయ కపోవడం... రెండేళ్లుగా పార్టీ జిల్లా, రాష్ట్ర కమిటీ లేకపోవడంతో పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఈసారి సభ్యత్వ నమోదు విష యంలో గ్రామ, మండల స్థాయిలో స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది. సభ్యత్వ నమోదు రుసుమును ఎమ్మెల్యేలే పూర్తిగా భరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు టీఆర్‌ఎస్‌ అధిష్టానం సభ్యత్వ రుసుములను పెంచింది. గతంలో రూ.10 ఉన్న సాధారణ సభ్యత్వ రుసుము రూ.30కి పెంచారు. క్రియాశీల సభ్యత్వ రుసుము రూ.50 నుంచి రూ.100కు పెంచారు.

19న ప్రారంభం
పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మొదలైంది. కీలకమైన సభ్యత్వ నమోదు విషయంలో వరంగల్‌ ఉమ్మడి జిల్లా ఎప్పుడూ ముందుండేది. ఇప్పుడూ అలాగే ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మార్చి 19న వరంగల్‌ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియను లాంఛనంగా ప్రారం భిస్తారు. 2015లో కంటే ఎక్కువగానే సభ్యత్వ నమోదు జరిగేలా ప్రణాళిక చేశాం. అన్ని నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ ఊపందుకోనుంది.
– తక్కళ్లపల్లి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement