- ఆదెమ్మదిబ్బ స్థలంపై వీడని చిక్కుముడి
- తాను కొనుగోలు చేశానన్న పిన్నమరెడ్డి ఈశ్వరుడు
- అమ్మిందీ లేదు.. కొన్న లేదన్న ‘సాక్షి’
- చివరకు తెరపైకి సత్యవోలు శేషగిరిరావు
- తాము అభివృద్ధి చేయిస్తున్నామంటూ వివరణ
- స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు చూపని వైనం
‘తెర’ పడేదెప్పుడు?
Published Tue, Dec 27 2016 11:24 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM
రాజమహేంద్రవరంలో రూ.కోట్ల విలువచేసే ఆదెమ్మదిబ్బ ప్రాంతంపై 20 రోజులుగా నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా ప్రజలు, అధికారుల్లో చర్చ సాగింది. తాజాగా సత్యవోలు శేషగిరిరావు ఈ స్థలం తనదంటూ విలేకర్ల సమావేశంలో చెప్పిన పలు వివరాలు స్థల యాజమాన్య హక్కుపై మరింత చిక్కుముడికి దారితీశాయి.
– సాక్షి, రాజమహేంద్రవరం
గత ఇరవై రోజులుగా ఆదెమ్మదిబ్బ స్థలంలో ఉన్న 110 మంది పేదలను ఖాళీ చేయించడం, వారికి నగదు ముట్టజెప్పడంతో దీనిపై అనేక అనుమానాలు రేకెత్తాయి. యాబై, ఆరవై ఏళ్లుగా అక్కడ ఉంటున్న పేదలను ఇప్పటికిప్పుడు ఎవరో వచ్చి ఈ స్థలం ఖాళీ చేయాలని ఆదేశించడంతో కొందరు పేదలు మీడియాను ఆశ్రయించారు. తాము ఎన్నో ఏళ్లుగా ఈ స్థలంలో ఉంటున్నామని, ఇప్ప డు ఎవరో వచ్చి ఖాళీ చేయాలని చెబుతున్నారని వాపోయారు. ఈ వ్యవహారాన్ని ఈ నెల 11వ తేదీన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. అనంతరం వరుస కథనాలు ప్రచురించింది. 13వ తేదీ అర్బ¯ŒS తహసీల్దార్ కె.పోసయ్య స్థలా న్ని పరిశీలించారు. అక్కడ ఉన్న పేదలతో మాట్లాడారు. తమకు ఇళ్లు లేవని ఇక్కడే స్థలం ఇవ్వాలని పేదలు తహసీల్దార్‌కు విన్నవించారు. అదే విధంగా తహసీల్దార్ పోసయ్య అక్కడ గుడిసెలు ఖాళీ చేయిస్తున్న వ్యక్తిని ఈ వ్యవహారంపై ప్రశ్నిం చారు. అదే రోజు తహసీల్దార్ పోసయ్య ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఆదెమ్మదిబ్బ స్థలం కోలమూరుకు చెందిన పిన్నమరెడ్డి ఈశ్వరుడు అనే వ్యక్తి సత్యవోలు పాపారావు కుమారుడు సత్యవోలు శేషగిరిరావు వద్ద కొనుగోలు చేశారని తనకు చెప్పారని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలని అడగ్గా సాయంత్రం లేదా మరుసటి రోజు తీసుకుని వచ్చి చూపిస్తానన్నారని వివరించారు. మరుసటి రోజు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, సీపీఎం నేతలు ఆ స్థలాన్ని పరిశీలించగా తాను ఈ స్థలం కొనుగోలు చేశానని వారితో పిన్నమరెడ్డి ఈశ్వరుడు పేర్కొన్నారు. వారికి కూడా డాక్యుమెంట్లు చూపిస్తానని చెప్పడడంతో వారు వెనుదిరిగారు. వారం రోజులు గడుస్తున్నా డాక్యుమెంట్లు అధికారులకు, రాజకీయ పార్టీల నేతలకు చూపించలేదు. దీనిపై ఈ నెల 21న ‘కొన్నది లేదు.. అమ్మిందీ లేదు’ అన్న శీర్షికన పలు ప్రశ్నలు సందిస్తూ ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో ఆ స్థలం సత్యవోలు పాపారావుదంటూ అక్కడ ఫ్లెక్సీపై రాయించి పెట్టారు.
ఎవరి స్థలం సేకరించారు?
ఫ్లెక్సీ పెట్టిన అనంతరం అక్కడ ఇళ్లను తొలగించడం కొనసాగించారు. అక్కడ నివసిస్తున్న పేదలకు పలు రకాల ప్రలోభాలు పెట్టడంపై కూడా ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. దీంతో సోమవారం సత్యవోలు పాపారావు కుమారుడు సత్యవోలు శేషగిరిరావు విలేకర్ల సమావేశం నిర్వహించి ఆదెమ్మదిబ్బ ప్రాంతంలోని సర్వే నంబర్ 730లో 4.19 ఎకరాల స్థలం తమ కుటుంబానిదని పేర్కొన్నారు. తన తండ్రి సత్యవోలు పాపారావు రెండు ఎకరాల 23 సెంట్లు, తన పినతండ్రి సత్యవోలు లింగమూర్తి ఎకరా 96 సెంట్లు లెక్కన పంచుకున్నారని వివరించారు. ఈ స్థలాన్ని అభివృద్ధి చేయాలని అక్కడ ఉన్న ఆక్రమణదారులను ఖాళీ చేయిస్తున్నామని చెప్పారు. అయితే 1985లో ప్రభుత్వం పలు సర్వే నంబర్లలో దాదాపు 5 ఎకరాలు 20 సెంట్లు సేకరించింది.
ఇందులో సర్వే నంబర్ 730లో సత్యవోలు లింగమూర్తి, సత్యవోలు పాపారావు కుంటుంబాలకు చెందిన సుమారు 3 ఎకరాల 25 సెంట్లు కూడా ఉంది. సేకరణ చేసిన భూమికి సంబంధించిన అవార్డును ప్రభుత్వం కొంతమందికి చెల్లించగా మరికొంత మంది అవార్డును కోర్టులో డిపాజిట్ చేసింది.
అయితే సర్వే నంబర్ 730లో సేకరించిన భూమి, అవార్డుపై సత్యవోలు శేషగిరిరావు విలేకర్ల సమావేశంలో భిన్నరకాల సమాధానాలు ఇచ్చారు. ప్రభుత్వం తమ భూమి సేరించిందని ఒకసారి, అది తమ పనితండ్రి వాటా అని మరోసారి, తమ వాటా అవార్డు తీసుకోలేదని, అస్సలు తమకు అవార్డుతో సంబంధంలేదని, ప్రభుత్వం నచ్చినట్లు రాసుకుందని, మరోసారి నగదులేక కోర్టులో జమ చేయలేదని, అవార్డు రద్దు చేశారని ఇలా పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. చివరగా ఈ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు జిల్లా జాయింట్ కలెక్టర్, రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్, అర్బ¯ŒS తహసీల్దార్‌కు చూపించామని, డాక్యుమెంట్ల నకళ్లు కూడా ఇచ్చామని పేర్కొన్నారు. మీడియాకు కూడా డాక్యుమెంట్ల నకళ్లు ఇస్తామని విలేకర్ల సమావేశంలో పలుమార్లు చెప్పినా చివరకు ఇవ్వకుండానే ముగించారు. ఈ స్థలం సత్యవోలు పాపారావు, లింగమూర్తికి చెందినది అని అధికారులు పేర్కొన్నా అందులో ఎవరి స్థలం ప్రభుత్వం సేకరించిందన్న దానిపై సందిగ్ధం నెలకొంది.
Advertisement
Advertisement