అదితి మృతదేహమే....
చిరునవ్వులు చిందిస్తూ ఇంటి నుంచి ట్యూషన్ కు వెళ్లిన ఆరేళ్ల చిన్నారి అదితి....చివరికి తిరిగిరాని లోకాలకు వెళ్లింది. తన బుజ్జాయి ఇంకా బ్రతికే ఉందన్న నమ్మకంతో ఉన్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాశలే అయ్యాయి. వారు చేసిన పూజలు, ప్రార్థనలు ఫలించలేదు. అధికారుల నిర్లక్ష్యం ఆరేళ్ల వయసులోనే ఓ చిన్నారికి నూరేళ్లు నిండేలా చేశాయి. ట్యూషన్ నుంచి గంతులేస్తూ హుషారుగా బయటకు వచ్చిన అదితి...చివరకు విగతజీవిగా మారింది. సరిగ్గా గత గురువారం విశాఖలో డ్రైనేజీలో కొట్టుకుపోయిన చిన్నారి అదితి ఉదంతం విషాదాన్ని నింపింది. కన్నవారికి కడుపు కోతను మిగిల్చింది.
అప్పటి నుంచి అదితి ఆచూకీ కోసం అధికారులు, పోలీసులు గాలింపు చేపట్టారు. అనుమానమొచ్చిన నల్లాలన్నింటినీ జల్లెడ పట్టారు. సముద్రంలోనూ అన్వేషణ సాగించారు. హెలికాఫ్టర్లు, అధునూతన టెక్నాలజీ సహాయంతో...పాపను గుర్తించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు గురువారం సాయంత్రం విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం సమీపంలోని సన్ రే బీచ్ ఒడ్డుకు అదితి మృతదేహం కొట్టుకు వచ్చింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న అదితి తండ్రి శ్రీనివాసరావు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శరీరంపై గుర్తులు, ఇంటి నుంచి వెళ్లేటప్పుడు అదితి వేసుకున్న పింక్ డ్రస్తో పాటు చెవి పోగుల ఆధారంగా ఆ మృతదేహం అదితిగా ఆమె తండ్రి గుర్తించారు. ఏదైతే జరగకూడదని అనుకున్నారో... ఒక్కసారిగా రోదిస్తూ ఆయన అక్కడ కుప్పకూలారు.